Indrakeeladri: అన్న ప్రసాదంలోనూ కక్కుర్తే

పుణ్యక్షేత్రమైన దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కాదేది నిలువు దోపిడీకి అనర్హం అన్న చందంగా కొందరు పాలకులు, అధికారులు వ్యవహరిస్తున్నారు.

Updated : 21 Feb 2024 06:44 IST

భక్తులకు తక్కువ రకం బియ్యంతో అన్నదానం

పాలకులు, అధికారుల జేబులోకి నెలకు రూ.10 లక్షలు

 ఇంద్రకీలాద్రి, న్యూస్‌టుడే: పుణ్యక్షేత్రమైన దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో కాదేది నిలువు దోపిడీకి అనర్హం అన్న చందంగా కొందరు పాలకులు, అధికారులు వ్యవహరిస్తున్నారు. స్వలాభమే పరమావధిగా వ్యవహరిస్తూ అన్నదానంలో తక్కువ రకం బియ్యం ఉపయోగిస్తూ నెలకు రూ.10 లక్షలు పక్కదారి పట్టిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది.

 రెండు నెలలుగా అక్రమం...

దుర్గగుడిలో అన్న ప్రసాదానికి భక్తులు రూ.100 కోట్లు విరాళంగా ఇచ్చారు. దీనిపైన వచ్చే వడ్డీతో రోజుకు ఆరు వేల మందికి అన్నదానం చేయవచ్చు. అయితే ప్రస్తుతం కేవలం మూడు, నాలుగు వేల మందికి మాత్రమే అన్న ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ మేరకు నెలకు 100 టన్నుల బియ్యాన్ని దేవస్థానం వినియోగిస్తుంది. టెండరు నిబంధనల్లో లలితాబ్రాండ్‌(ఆరంజ్‌) అందిస్తామని గుత్తేదారు పేర్కొన్నారు. అయితే రెండు నెలలుగా ‘డింగ్‌డాంగ్‌ బెల్‌’ కంపెనీ పేరు ఉన్న బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు.

ముడుపులు చెల్లిస్తూ...

కిలో లలితా బ్రాండ్‌ బియ్యానికి దేవస్థానం రూ.46 చెల్లిస్తోంది. ప్రస్తుతం గుత్తేదారు సరఫరా చేసే బియ్యం మార్కెట్‌లో కిలో రూ.36(స్ట్రీమ్‌ బియ్యం) మాత్రమే. ఈ క్రమంలో కిలోకు రూ.10 గుత్తేదారుకు మిగులుతోంది. వంద టన్నుల సరఫరాకు సుమారుగా రూ.10 లక్షలు మిగులుతోంది. ఆ సొమ్మును ఓ అధికారి నేరుగా సగం జేబులో వేసుకొని, మిగిలింది కొందరు పాలకులకు ముడుపులు చెల్లిస్తూ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. గతంలో ఈవోగా భ్రమరాంబ ఉన్నప్పుడు సైతం వీరు యథేచ్ఛగా అమ్మ సొమ్మును దోచుకున్న దాఖలాలు పత్రికల ద్వారా వెలుగుచూశాయి. ప్రస్తుత ఈవో రామారావు ఇక్కడ బాధ్యతలు స్వీకరించినప్పటికీ డిప్యుటేషన్‌పై మూడు రోజులు శ్రీకాళహస్తి వెళ్లి వస్తుండటం, వ్యక్తిగత సెలవులపై ఉండటంతో అక్రమాలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదని కొందరు దేవస్థానం ఉద్యోగులు చెబుతున్నారు. ఉన్నతాధికారులు దృష్టి సారించకుంటే దుర్గగుడి ప్రతిష్ట మరింత మసక బారే ప్రమాదం ఉంది.  


విచారణ చేసి చర్యలు తీసుకుంటాం...

టెండర్‌ నిబంధనలు అమలయ్యేలా చూస్తాం. బియ్యం విషయంలో పూర్తి పరిశీలన చేసి తప్పిదాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.

- రామారావు, ఈవో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని