రుషికొండలో ఏం జరిగింది?!

ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది.

Updated : 19 Mar 2024 07:07 IST

ఎంపీ ఎంవీవీ నివాసంలో ఐటీ దాడులనే సమాచారంతో కలకలం!

 మధురవాడ, సాగర్‌నగర్‌, న్యూస్‌టుడే: ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇంటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సోమవారం రాత్రి తీవ్ర కలకలం రేగింది. ముందు లాసన్స్‌బే కాలనీలో అంటూ సమాచారం రావడం, అక్కడ కాదు సీతమ్మధార, రుషికొండ ఐటీహిల్స్‌ వద్దనున్న నివాసంలో అని తెలియడంతో విలేకరులు అటుగా వెళ్లారు. అయితే ఎలాంటి దాడులు జరిగినట్లు స్పష్టంగా వెల్లడి కాలేదు. రుషికొండలోని నివాసం నుంచి ఏవో శబ్ధాలు రావడంతో ఇక్కడేదో జరుగుతుందని తొలుత కొందరు అనుమానించారు. అదే సమయంలో ఎంవీవీ కుమారుడు ఇంటికి రావడం, ప్రవేశ ద్వారం వద్ద విలేకరులను చూసి వారితో సుమారు అరగంట సేపు ముచ్చటించారు. ఇక్కడ ఐటీ దాడులు జరగడం లేదని, లోపల ఎవరూ లేరని చెప్పి ఇంట్లోకి వెళ్లిపోయారు. ఇదిలా ఉండగా సుమారు 7 గంటల సమయంలో ఒక ఇన్నోవా కారులో నలుగురు సభ్యులు ఇంట్లోకి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. దీనిపై అక్కడి కాపలాదారులను ప్రశ్నించగా లోపల యజమాని బంధువులు ఉన్నారన్నారు. ఎంవీవీ కుమారుడు ఇంట్లో ఎవరూ లేరని చెప్పడం, కాపలా సిబ్బంది బంధువులు ఉన్నారని వేర్వేరు సమాధానాలు రావడంతో దాడులు జరుగుతున్నాయని పలువురు అనుమానించారు. ఐటీ దాడులనే సమాచారం మేరకు ఇంటిలిజెన్స్‌ విభాగ అధికారులు వచ్చి వివరాలు సేకరించారు. రాత్రి 12 గంటలు దాటినా ఎంవీవీ ఇంట్లో దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఎవరైనా తప్పుడు సమాచారం అందించి ఇలా చేశారా....నిజంగానే దాడులు జరిగాయా అనేది వెల్లడి కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని