గత లోపాలు పునరావృతం కాకుండా చందనోత్సవం

సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు.

Updated : 19 Mar 2024 05:40 IST

ధర్మకర్తల మండలిలో చర్చించాలని కమిషనర్‌ ఆదేశం

సింహాచలం, న్యూస్‌టుడే: సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవం గత ఏడాది ఘోరంగా విఫలమైన నేపథ్యంలో ఈ ఏడాది ఉత్సవాన్ని పక్కా ప్రణాళికతో విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ సింహాచలం దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తిని ఆదేశించారు. ఆ మేరకు పలు సూచనలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. మే 10వ తేదీన జరగనున్న ఈ ఉత్సవం రోజున అప్పన్న స్వామి నిజరూప దర్శనం భక్తులకు సౌకర్యవంతంగా కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోజు ఆలయ వైదిక సిబ్బంది, దేవాలయ సంప్రదాయాన్ని అనుసరించి అనుమతి ఉన్న వ్యక్తులకు మినహా ఇతరులెవరికీ అంతరాలయ దర్శనం కల్పించవద్దని స్పష్టం చేశారు. సింహగిరిపైకి రాకపోకలు సాగించేందుకు కేవలం మినీ బస్సులను ఘాట్రోడ్డులో ఒకవైపు మాత్రమే అనుమతిం చాలన్నారు. ఈ ఉత్సవ నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ముందుగా నియమించాలని; టికెట్ల పరిశీలన, క్యూలైన్ల నిర్వహణ బాధ్యతలు పోలీసులకు అప్పగించాలని సూచించారు. ఆ మేరకు ఈనెల 30వ తేదీలోగా ఆలయ ధర్మకర్తల మండలితో సమావేశం నిర్వహించి తీసుకునే చర్యలను తమకు తెలియజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రొటోకాల్‌కు దూరంగా..

ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న నేపథ్యంలో చందనోత్సవంలో ప్రొటోకాల్‌ దర్శనాలకు అవకాశం లేదు. ప్రముఖులంతా సాధారణ భక్తుల మాదిరి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉత్సవం 2019 ఎన్నికల సమయంలో జరిగినప్పటికీ భక్తులకు సంతృప్తికరంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనం లభించింది. గత ఏడాది చందనోత్సవంలో ప్రొటోకాల్‌ ప్రముఖుల దర్శనాలే పరమావధిగా ఉత్సవం జరగడంతో తీవ్రంగా విఫలమైంది. సాధారణ భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురి కావడంతో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి, కమిషనర్లు సహా ప్రజా ప్రతినిధులు, అధికారులు తీవ్ర విమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఈ ఏడాది ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో ప్రశాంతంగా చందనోత్సవం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. కమిషనర్‌ తాజా ఉత్వర్వుల నేపథ్యంలో అధికారులు ముందస్తు ఏర్పాట్లతో మరింత సమర్థంగా ఈ ఉత్సవం నిర్వహించవచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. కాగా, కమిషనర్‌ ఉత్తర్వులపై ట్రస్టుబోర్డు సభ్యులకు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని