Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 24 Jul 2021 20:57 IST

1. రాజీనామా చేయాలనుకుంటే చేయండి: సజ్జల

ప్రత్యేక హోదా కోసం తెదేపా అధినేత చంద్రబాబు తన ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించాలనుకుంటే చేయించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రతి అంశంలో వైకాపా సభ్యుల రాజీనామాలు ఎందుకు డిమాండ్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉండగా ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంపీలు రాజీనామాలు చేసి వాటిని ఆమోదింపజేసుకున్నారని సజ్జల గుర్తు చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో అప్పటి ప్రతిపక్షనేతగా జగన్ కూడా ఆందోళన చేశారని.. కలిసి రావాల్సిందిగా తెదేపాను ఎప్పుడూ డిమాండ్ చేయలేదన్నారు.

2. టార్గెట్ చేసి పక్కటెముకలు విరిగేలా కొట్టారు: రేవంత్‌

చలో రాజ్‌భవన్ పేరుతో హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద చేపట్టిన మహా ధర్నాలో పోలీసుల అత్యుత్సాహం వల్లే ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గాయపడ్డారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. బల్మూరి వెంకట్‌కు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్, అంజన్‌కుమార్‌ యాదవ్‌తో కలిసి రేవంత్‌ నారాయణగూడలోని ఆయన నివాసంలో వెంకట్‌ను కలిసి పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఏపీలో కొత్తగా 2,174 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 647 కరోనా కేసులు

3. తిరుచానూరు ఆలయంలో శాస్త్రోక్తంగా ముగిసిన మహాయాగం

క‌రోనా మహమ్మారితో ప్రపంచ మాన‌వాళికి త‌లెత్తిన ఆర్థిక ఇబ్బందులు తొల‌గిపోవాలని ప్రార్థిస్తూ మ‌హాల‌క్ష్మి అవ‌తార‌మైన తిరుచానూరు శ్రీప‌ద్మావ‌తి అమ్మవారికి తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) నిర్వహించిన మ‌హాయాగం శాస్త్రోక్తంగా ముగిసింది. ఉద‌యం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, సహస్రనామార్చన, నిత్యార్చన జరిపారు. నిత్య హ‌వ‌నం, మ‌హా ప్రాయ‌శ్చిత హోమం, మ‌హా పూర్ణాహూతి, కుంభ ప్రోక్షణ నిర్వహించి ఆల‌యంలోని శ్రీకృష్ణస్వామి ముఖమండ‌పంలో అమ్మవారిని వేంచేపు చేశారు.

4. ఎంపీ మాలోత్‌ కవితకు 6నెలల జైలు శిక్ష

మహబూబాబాద్‌ తెరాస ఎంపీ మాలోత్‌ కవితకు ప్రజాప్రతినిధుల కోర్టు జైలు శిక్ష ఖరారు చేసింది. కవితకు ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓటర్లకు డబ్బు పంచారన్న కేసులో ఎంపీ కవితపై 2019లో బూర్గంపహాడ్‌ పోలీసస్టేషన్‌లో కేసు నమోదైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కవితకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు మేరకు రూ. 10వేల జరిమానాను ఎంపీ చెల్లించారు. 

5. కృష్ణా ప్రాజెక్టులకు జలకళ.. తీరనున్న సాగునీటి కష్టాలు

ఎడతెరిపిలేని వర్షాలు, భారీ వరదలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. జూరాల జలాశయానికి వరద పోటెత్తుతోంది. జూరాల పూర్తి స్థాయి నీటిమట్టం 1048 అడుగులు కాగా ప్రస్తుతం 1,039 అడుగులకు చేరింది. ఆల్మట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి 3,20,000 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో జూరాల ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి 2,97,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి ద్వారా 18,360 క్యూసెక్కుల నీరు నదిలోకి వెళ్తోంది. 

6. కవితను కేటీఆర్‌ ఏమని పిలిచారంటే?

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరి, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేటీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య. ఈ ఏడాదంతా నువ్వు సంతోషంగా ఉంటూ మరిన్ని విజయాలను అందుకోవాలి’’ అని ట్విటర్‌ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కవిత ట్వీట్‌కు కేటీఆర్‌ స్పందిస్తూ.. ‘‘థ్యాంక్యూ పప్పు’’ అని రీట్వీట్‌ చేశారు. మంత్రి కేటీఆర్‌ పుట్టినరోజును తెరాస శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాయి.

7. ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యం.. నిలిచిపోయిన అంబులెన్స్‌లు

నగరంలోని మాసబ్‌ట్యాంక్‌ లో డీజీపీ ప్రొటోకాల్‌ కోసం శనివారం సాయంత్రం ట్రాఫిక్‌ పోలీసులు వాహనాలను ఆపేశారు. దీంతో అత్యవసర రోగులున్న రెండు అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. అంబులెన్స్‌లో ఉన్న వైద్య సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసుకుంటూ ముందుకు సాగారు. ఈఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో హోం మంత్రి మహమూద్‌ అలీ స్పందించారు. ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబులెన్స్‌ ఘటనపై హోం మంత్రి ఆరా తీశారు. దీనిపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ వివరణ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు.

8. తుపాకీ లైసెన్సుల స్కాం.. ఓ ఐఏఎస్‌ ఇంట్లో సహా 40చోట్ల సోదాలు

తుపాకీ లైసెన్సుల మంజూరులో గోల్‌మాల్‌ వ్యవహారంపై విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. దేశ రాజధాని దిల్లీ సహా జమ్మూకశ్మీర్‌లోని పలు చోట్ల ముమ్మర సోదాలు చేపట్టింది. ఇందులో భాగంగా శనివారం ఉదయం నుంచి శ్రీనగర్‌లోని సీనియర్‌ ఐఏఎస్‌ షాహిద్‌ ఇక్బాల్‌ చౌధురి ఇంటితో పాటు మొత్తం 40 చోట్ల సోదాలు కొనసాగిస్తోంది. శ్రీనగర్‌, ఉదంపూర్‌, రాజౌరి,అనంత్‌నాగ్, బారాముల్లా ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్టు అధికారులు వెల్లడించారు. జమ్మూకశ్మీర్‌ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అయిన షాహిద్‌ ఇక్బాల్‌ చౌధురి ప్రస్తుతం గిరిజన వ్యవహారాల శాఖ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. 

9. సర్కారు బడిలోనే నాటు సారా బట్టీ

గుంటూరు జిల్లాలో నాటుసారా మాఫియా బరితెగించింది. ఏకంగా పాఠశాల ప్రాంగణంలోనే నాటుసారా తయారు చేస్తుండగా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. నిజాంపట్నం మండలం హారీస్‌పేట ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా గత కొంతకాలంగా పాఠశాలకు సెలవు కావడంతో తెరవడంలేదు. ఇదే అదునుగా భావించిన నాటు సారా తయారీదారులు దర్జాగా.. పాఠశాల ఆవరణలోనే సారా తయారీ బట్టీ పెట్టారు.

10. ఆ మనస్తత్వమే రజత పతకం ముద్దాడేలా చేసింది!

టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించి ప్రపంచ యౌవనికపై భారతదేశ కీర్తి జెండాను రెపరెపలాడించారు మణిపూర్‌కు చెందిన వెయిట్ లిఫ్టర్‌ మీరాబాయి చాను. ఆమె సాధించిన అపూర్వ విజయానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. రియో ఒలింపిక్స్‌లో ఎదురైన ఓటమినే విజయ సోపానాలుగా మార్చుకున్న వైనం అసాధారణమైనది. పట్టుదల, కఠోర సాధన కలబోతతో టోక్యో ఒలింపిక్స్‌లో కదన రంగంలోకి దూకి అద్భుతమైన ప్రదర్శనతో అందరితో భళా అనిపించుకున్నారు. ఒలింపిక్స్‌లో వెయిట్‌ లిఫ్టింగ్‌ విభాగంలో రజతం సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించిన సాయికోమ్‌ మీరాబాయి చాను ఈ ఆనంద క్షణాల వెనుక ఐదేళ్ల కష్టం, కృషి దాగి ఉన్నాయి. 

మీరా... నీ నిర్విరామ కృషికి సెల్యూట్‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని