DSC: నిబంధనలకు విరుద్ధంగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారు?: ఏపీ హైకోర్టు

ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుబట్టింది.

Updated : 20 Feb 2024 18:57 IST

అమరావతి: ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు ప్రాథమికంగా తప్పుబట్టింది. అద్దంకి వాసి బొల్లా సురేష్‌, మరికొందరు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం హైకోర్టు విచారణ జరిపింది. ఎస్జీటీ పోస్టులకు బీఎడ్‌ అభ్యర్థులను అనుమతించటం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వల్ల డీఎడ్‌ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారని కోర్టుకు తెలిపారు. ఎన్‌సీఈటీ నిబంధనలకు పూర్తి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టిందన్నారు.

ఎస్జీటీ అభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగానే బీఎడ్‌ అభ్యర్థులను అనుమతించాల్సి వస్తోందని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. అర్హత సాధించిన బీఎడ్‌ అభ్యర్థులు రెండేళ్ల బ్రిడ్జి కోర్స్‌ చేసిన తర్వాతే.. బోధనకు అనుమతిస్తామన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారు? బ్రిడ్జి కోర్సుకి చట్టబద్ధత ఏముందని  ఏజీని న్యాయస్థానం ప్రశ్నించింది. తక్షణమే నోటిఫికేషన్‌ నిలుపుదల చేస్తామంటూ ఉత్తర్వులిచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. ప్రభుత్వ వివరణ తీసుకొనేందుకు ఒక్కరోజు సమయం కావాలని ఏజీ కోర్టును అభ్యర్థించారు. ఫిబ్రవరి 23 నుంచి హాల్ టికెట్లు ఇచ్చే ప్రక్రియ కొనసాగనుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి  తెచ్చారు. హాల్ టికెట్లు జారీ చేయకుండా ఉత్తర్వులు ఇస్తామని ధర్మాసనం తెలిపింది. అడ్వకేట్ జనరల్ అభ్యర్థన మేరకు తదుపరి విచారణను న్యాయస్థానం బుధవారానికి వాయిదా వేసింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని