Rain alert: హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మరో 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 

Updated : 21 Jul 2023 22:27 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మరో 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఈ 3 జిల్లాల ప్రజలు ఎవరూ అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వరదలు, చెట్లు కూలడం వంటి సమస్యలపై ఫిర్యాదుకు జీహెచ్‌ఎంసీ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 040-211 11111, 90001 13667కు ఫోన్‌ చేయాలని సూచించారు.

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..

మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణశాఖ వెల్లడించింది. కోస్తాంధ్ర - ఒడిశాను ఆనుకుని అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్లు తెలిపింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, ఒడిశా, మధ్యప్రదేశ్‌, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఈనెల 25 వరకు మోస్తరు నుంచి విస్తారంగా జల్లులు కురిసే అవకాశం ఉందని వివరించింది.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: తలసాని

భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అధికారులను ఆదేశించారు. నగర పరిస్థితులను GHMC కమిషనర్ రోనాల్డ్ రాస్‌ను అడిగి తెలుసుకున్నారు. హుస్సేన్‌సాగర్‌కు భారీ వరద దృష్ట్యా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని చెప్పారు. నీటిని దిగువకు విడుదల చేస్తున్న దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా రేపు విద్యాసంస్థలకు సెలవు

వర్షాల దృష్ట్యా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు శనివారం సెలవు ప్రకటిస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో భారీ వర్షాల దృష్ట్యా ఇప్పటికే గురువారం, శుక్రవారం విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం సెలువులు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా రేపు కూడా సెలవు ప్రకటిస్తూ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు శుక్రవారం, శనివారం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని