Organ Donation Day: ‘బతికున్నప్పుడు రక్తదానం.. మరణించాక అవయవదానం’ నినాదంగా మారాలి

అవయవ మార్పిడిలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. గ్లోబల్‌ అబ్జర్వేటరీ ఆన్‌ డొనేషన్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌(జీఓడీటీ) వివరాల ప్రకారం.. అమెరికా, చైనాల తర్వాతి స్థానం భారత్‌దేనని తెలిపారు...

Published : 28 Nov 2021 01:25 IST

దిల్లీ: అవయవ మార్పిడిలో భారత్‌ ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేర్కొన్నారు. గ్లోబల్‌ అబ్జర్వేటరీ ఆన్‌ డొనేషన్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌(జీఓడీటీ) వివరాల ప్రకారం.. అమెరికా, చైనాల తర్వాతి స్థానం భారత్‌దేనని తెలిపారు. 12వ జాతీయ అవయవదాన దినోత్సవం పురస్కరించుకుని శనివారం మంత్రి ప్రసంగించారు. ‘త్యాగం, దయాభావం మన గొప్ప సంస్కృతిలో అంతర్భాగాలు. బతికున్నప్పుడు రక్తదానం.. మరణించాక అవయవదానం అనేది మన నినాదంగా మారాలి’ అని మంత్రి ఆకాంక్షించారు.  2012-13తో పోల్చితే ప్రస్తుతం అవయవ దానం రేటు నాలుగు రెట్లు పెరిగిందని  వెల్లడించారు. దేశంలో ఏటా జరిగే అవయవ మార్పిడిల సంఖ్య సైతం 2013లో 4990 ఉండగా.. 2019 నాటికి 12,746కి చేరుకుందన్నారు. 

‘ప్రజలను చైతన్యవంతులు చేయాలి’

మరోవైపు ఇప్పటికీ.. అవయవ మార్పిడి అవసరమైన రోగుల సంఖ్య, అవయవదానానికి ముందుకొస్తున్నవారి మధ్య భారీ అంతరం ఉందని మంత్రి తెలిపారు. కొవిడ్‌ పరిస్థితులూ దీనిపై ప్రతికూల ప్రభావం చూపాయని, త్వరలోనే దీన్నుంచి బయటపడతామనే ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు, వైద్యులు, అవగాహన కలిగిన పౌరులు.. అవయవ దానం ఆవశ్యకతపై ప్రజలను చైతన్యవంతులు చేయాలని కోరారు. అవయవ దాతలు, వారి కుటుంబాలు సమాజానికి అందించిన సేవలను స్మరించుకునేందుకు 2010 నుంచి ఏటా నవంబరు 27న జాతీయ అవయవదాన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని