ఆ ప్రతిష్ఠాత్మక విమానం ఇప్పుడు కాకినాడలో..

నావికాదళంలో ఎన్నో ఏళ్లు సేవలందించిన టీయూ-142 యుద్ధ విమానం ఇకపై కాకినాడలో దర్శనమివ్వనుంది. శత్రుమూకలకు ముచ్చెమటలు పట్టించిన జలాంతర్గామిని కాకినాడ బీచ్‌లో ప్రదర్శించేందుకు గోదావరి నగర అభివృద్ధి సంస్థ....

Published : 20 Feb 2021 00:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నావికాదళంలో ఎన్నో ఏళ్లు సేవలందించిన టీయూ-142 యుద్ధ విమానం ఇకపై కాకినాడలో దర్శనమివ్వనుంది. శత్రుమూకలకు ముచ్చెమటలు పట్టించిన ఆ విమానం కాకినాడ బీచ్‌లో ప్రదర్శించేందుకు గోదావరి నగర అభివృద్ధి సంస్థ (గుడా) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. సముద్ర గస్తీలో రెండున్నర దశాబ్దాలకు పైగా కీలక పాత్ర పోషించి, నిష్ర్కమించిన ఈ యుద్ధ విమానాన్ని నావికాదళం కాకినాడకు కేటాయించింది. ఇప్పటికే విశాఖలో ఈ విమాన ప్రాజెక్టు అక్కడివారిని ఆకర్షిస్తుండగా దాని తరహాలోనే కాకినాడలో అభివృద్ధి చేస్తున్నారు. 

గుడా ఆధ్వర్యంలో రూ.5.89 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇంతకు ముందు కాకినాడ బీచ్‌లోని పార్కులో ఏర్పాటు చేసిన దీపక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ ప్రాంగణంలోనే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. తనీజ ఏరోస్పేస్‌ ఆధ్వర్యంలో విమాన విడిభాగాల అమరిక జరుగుతోంది. ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామని ప్రాజెక్టు హెడ్‌ కెప్టెన్‌ వెంకటేశ్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కాకినాడ బీచ్‌కు మరింత పర్యాటక గుర్తింపు వస్తుందని అధికారులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు