
Viral video: ఐఫోన్‌తో కేక్ కటింగ్.. వీడియో చూడండి!
ఇంటర్నెట్ డెస్క్: పుట్టినరోజున అందరూ కేక్‌ను సాధారణంగా చాకుతో కోస్తారని తెలుసు. కానీ, ఐఫోన్‌తో కట్ చేయడం ఎప్పుడైనా చూశారా? ఇటువంటి వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. కర్ణాటకలోని కనకగిరి (కొప్పల్) భాజపా ఎమ్మెల్యే బసవరాజ్ దాడేస్‌గుర్ కుమారుడు సురేష్ తన పుట్టిన రోజు సందర్భంగా మిత్రులతో కలిసి.. బీఎండబ్ల్యూ కారులో బళ్లారి జిల్లాలోని హోసపేటకు వెళ్లాడు. అక్కడ ఏర్పాటు చేసిన 8 కేకులను తన ఐఫోన్‌తో ఒకేసారి కట్ చేశాడు. ఈ క్రమంలో అతని మిత్రులు ఫోన్‌లో వీడియో తీశారు. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
ఈ వీడియోపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ‘నియోజకవర్గంలో చాలా మంది తిండి లేకుండా అల్లాడుతున్నారు. కానీ, ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు మాత్రం ఆడంబరంగా జీవిస్తున్నారు. ఇలా చేయడం పేద, అణగారిన వర్గాలను అవమానించడమే’ అని విమర్శలు గుప్పించారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో తన కుమారుడిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో సదరు ఎమ్మెల్యే స్పందించారు. తన కుమారుడిని సమర్థిస్తూ.. ‘ఇందులో తప్పేముంది? కొవిడ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నా కుమారుడు ఐఫోన్‌తో కేక్ కట్ చేశాడు’ అని వెనకేసుకు రావడం గమనార్హం. కాగా.. ఎమ్మెల్యే ప్రవర్తనను ఉటంకిస్తూ స్థానికంగా వార్తలు ప్రసారమయ్యాయి. ఎన్నికలకు ముందు నాటికీ, ఇప్పటికీ ఆయనలో చాలా మార్పు వచ్చిందని పేర్కొన్నాయి. ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజల నుంచి నిధులను సేకరించి.. గెలిచాక ఆ డబ్బుతోనే లగ్జరీ కార్లను కొనుగోలు చేశారని ఆరోపించాయి.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.