Andhra News: ఆంధ్రప్రదేశ్‌లో 52 డ్రోన్లతో సమగ్ర భూసర్వే ప్రక్రియ: మంత్రుల కమిటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 52 డ్రోన్లతో సమగ్ర భూసర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు దీనిపై ఏర్పాటైన మంత్రుల కమిటీ స్పష్టం చేసింది.

Published : 13 May 2022 19:22 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 52 డ్రోన్లతో సమగ్ర భూసర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు దీనిపై ఏర్పాటైన మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియా, ఏపీ ప్రభుత్వం, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా 172 డ్రోన్లు సమకూర్చుకోనున్నట్టు మంత్రులు తెలిపారు. ఇప్పటివరకూ 2,149 గ్రామాల్లో డ్రోన్ ద్వారా సర్వే పూర్తి అయ్యిందని వివరించారు. సచివాలయంలో భూసర్వే ప్రక్రియపై సమావేశమైన మంత్రుల కమిటీ దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహించింది.

‘‘రాష్ట్ర వ్యాప్తంగా 756 గ్రామాల్లో గ్రౌండ్ ట్రూతింగ్ ప్రక్రియ పూర్తి చేశాం. ప్రజల నుంచి 9,283 విజ్ఞాపనలు అందాయి. వాటిలో 8,935 విజ్ఞప్తులను పరిష్కరించాం. సమగ్ర భూసర్వే ప్రక్రియలో భాగంగా 18,487 సర్వే రాళ్ళను పాతి సరిహద్దులు నిర్ణయించాం. రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ ప్రాంతాల్లోని స్థానిక సంస్థల్లో 5,548.90 చ.కి.మీ. పరిధిలో 30లక్షల నిర్మాణాలు ఉన్నాయి. అలాగే 13 జిల్లా కేంద్రాల్లో ప్రాసెసింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి, వాటి ద్వారా సర్వే కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తాం. భవిష్యత్తులో ఎటువంటి భూ వివాదాలు లేకుండా ఈ సర్వే మంచి పరిష్కారాన్ని చూపుతుంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని నివాసాలు, గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు, పట్టణ ప్రాంతాల్లోని ఖాళీ భూములకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అత్యంత శాస్త్రీయంగా సర్వే ద్వారా నిర్ధారిస్తాం’’ అని మంత్రుల కమిటీ తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని