
చిరుతలు..పెరుగుతున్నాయి..
దిల్లీ: దేశంలో చిరుత పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2018లో చేపట్టిన గణన ప్రకారం దేశంలో ప్రస్తుతం 12,852 చిరుతలు ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ‘భారత్‌లోని చిరుతలు 2018’ పేరుతో కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఓ నివేదిక విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఆయన ట్విటర్ వేదికగా పంచుకున్నారు.
‘2014తో పోలిస్తే.. 2018లో చేసిన గణన ప్రకారం దేశంలో చిరుత సంఖ్య 60శాతం పెరిగింది. ప్రస్తుతం దేశంలో 12,852 చిరుతలు ఉన్నాయి. దేశంలో అత్యధికంగా చిరుతలు కలిగిన తొలి మూడు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ (3,421), కర్ణాటక(1783), మహారాష్ట్ర(1690)లు నిలిచాయి. వన్యప్రాణి సంరక్షణకు, జీవవైవిధ్యతకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు.. గత కొద్ది సంవత్సరాలుగా పులులు, చిరుతలు, సింహాల సంఖ్య పెరుగుదలే నిదర్శనం’ అని జావడేకర్ ట్విటర్‌లో స్పష్టం చేశారు.
ఇదీ చదవండి
బ్రిటన్ నుంచి భారత్‌కు విమానాల రద్దు