నా కుమార్తెకు స్కూల్లో బలవంతంగా కోడిగుడ్లు తినిపించారు.. తండ్రి ఫిర్యాదు!

స్కూల్లో తన కుమార్తెకు బలవంతంగా కోడిగుడ్లు తినిపించారంటూ ఓ వ్యక్తి విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

Published : 24 Nov 2023 01:54 IST

శివమొగ్గ: రెండో తరగతి చదువుతున్న తన కుమార్తెకు పాఠశాలలో బలవంతంగా కోడిగుడ్లు తినిపించారని విద్యాశాఖ అధికారులకు ఓ తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన కర్ణాటకలోని శివమొగ్గలో వెలుగుచూసింది. చిన్నారి తండ్రి ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన విద్యాశాఖ అధికారులు.. ఈ అంశంపై విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా తన కూతురికి గుడ్లు తినాలని బలవంతపెట్టారని, తద్వారా తమ  మనోభావాల్ని దెబ్బతీశారంటూ ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఫిర్యాదు చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఈ చర్యకు పాల్పడిన పాఠశాల ఉపాధ్యాయుడు, ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు. అయితే, ఆ వ్యక్తి చేసిన ఆరోపణల్ని అధికారులు కొట్టిపారేశారు. 

తాము కఠినమైన శాకాహార డైట్‌ ఫాలో అవుతామని ముందే చెప్పామని.. అయినా సరే ఉపాధ్యాయులు తన కూతురికి బలవంతంగా గుడ్డు తినిపించారని అతడు ఆరోపించారు. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు ఈ ఘటనపై బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌తో విచారణకు ఆదేశించారు. మధ్యాహ్న భోజనం వడ్డిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘విద్యార్థులంతా కలిసి మధ్యాహ్న భోజనానికి వరుసలో కూర్చున్నారు. అప్పుడే సంబంధిత ఉపాధ్యాయుడు గుడ్లు కావాల్సిన వారిని చేతులు ఎత్తాలని అడిగారు. ఈ చిన్నారి కూడా మిగిలిన విద్యార్థులతో కలిసి చేతులు ఎత్తినట్లు కనబడింది. దీంతో ఆమెకు గుడ్డు అందించారు. అంతేగానీ, ప్రత్యేకంగా ఈ చిన్నారితో పాటు ఎవరికీ గుడ్లు తినాలని బలవంత పెట్టలేదు’’ అని వివరించారు. 

ఇదే అంశంపై శివమొగ్గ పబ్లిక్‌ ఇన్‌స్ట్రక్షన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ సీఆర్‌ పరమేశ్వరప్ప స్పందిస్తూ..  ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. కాకపోతే,  తమకు వచ్చిన సమాచారం ఆధారంగా ఆ చిన్నారికి  బలవంతంగా గుడ్డు వడ్డించలేదన్నారు. బ్లాక్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ ఇచ్చిన నివేదికను పరిశీలించి.. ఏదైనా ఉల్లంఘనకు పాల్పడినట్లు తేలితే సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని