
Corona కట్టడిలో ఏపీ ముందంజ: బుగ్గన
అనంతపురం: కొవిడ్ చికిత్సకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయించిన ధరలనే ప్రైవేటు ఆస్పత్రులు అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఆదేశించారు. వీటిని పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కరోనా నివారణ చర్యలపై అనంతపురం జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మంత్రి గురువారం సమీక్ష నిర్వహించారు. గత ఏడాది మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో తీసుకున్న చర్యలు.. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. గత ఏడాది కరోనా వైరస్ అందరికీ కొత్త కావడంతో వైద్యం అందించడం, టెస్టింగ్ వంటి విషయాల్లో తడబడ్డామన్నారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో కొవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను అధికారులు మంత్రికి వివరించారు.
అనంతరం బుగ్గన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నియంత్రణలో ఏపీ దేశంలోనే ముందంజలో ఉందన్నారు. రాష్ట్రంలో కరోనా నివారణకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రుల బృందం అన్ని చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఖర్చుకు వెనకాడకుండా ప్రజలకు అవసరమైన వైద్యం అందించాలని సీఎం సూచించినట్లు చెప్పారు. అవసరమైన ప్రాంతాల్లో అన్ని వసతులతో కొవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న మందుల కొరతను అధిగమిస్తామన్నారు. అనంత జిల్లా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లోని సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని.. వాటిని వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కరోనా కొత్తగా రూపాంతరం చెందడంతో కొత్త ఔషధాలు, నూతన వైద్య విధానాలను అవలంబించాల్సి వస్తోందని.. అందుకు తగ్గట్టుగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. కొన్ని ప్రాంతాల్లో వైద్యుల కొరత ఉందని, దాన్ని పరిష్కరించే దిశగా వెంటనే చర్యలు తీసుకుంటామని బుగ్గన తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.