Komatireddy Venkat reddy: డిసెంబర్‌ 28న మరికొన్ని గ్యారంటీలు: మంత్రి కోమటిరెడ్డి

తెలంగాణలోని 14 రాష్ట్ర రహదారులను (State High Ways) జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat reddy) తెలిపారు.

Updated : 11 Dec 2023 19:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని 14 రాష్ట్ర రహదారులను (State High Ways) జాతీయ రహదారులుగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని.. అందుకు కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) సానుకూలంగా స్పందించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komati Reddy Venkat reddy) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారని.. అందుకోసం ప్రభుత్వం తరఫున కోమటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు.

‘‘గత ఐదేళ్లుగా రాష్ట్రంలో రాష్ట్ర రహదారుల స్థితిని నేను చూస్తూ వచ్చాను. కొన్ని చోట్ల రహదారులపై గుంతలు ఏర్పడితే మట్టితో నింపేశారు. గుంతలు ఏర్పడితే సిమెంట్‌, లేదా బీటీ ప్యాచ్‌లు వేసి గుంతలను పూడ్చాల్సి ఉంటుంది. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ముందుగా అధికారులకు ఆదేశాలు ఇచ్చాను. రహదారులపై ఎక్కడ గుంతులున్నా.. వాటిని వెంటనే మరమ్మతు చేయాలని చెప్పా. రాష్ట్ర రహదారుల విషయంలో ఏపీతో పోల్చితే తెంగాణకు కేంద్రం నుంచి తక్కువ నిధులు వచ్చాయి. ఇప్పటినుంచి కేంద్ర ప్రభుత్వంతో తరచూ సంప్రదింపులు చేస్తూ రాష్ట్రానికి ఎక్కువ నిధులు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తాం.

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రెండింటిని మొదలుపెట్టాం. మిగిలినవి కూడా అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. డిసెంబర్‌ 28న.. కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం రోజున మరికొన్ని గ్యారంటీలను మొదలు పెడతాం. ఇలా 100 రోజుల్లోగా అన్ని గ్యారంటీలను అమల్లోకి తీసుకొచ్చి.. తెలంగాణలో ప్రజా పాలన కొనసాగిస్తాం’’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని