KTR: కంటోన్మెంట్‌ బోర్డు నిర్ణయం.. 35వేల మంది ఓటు హక్కును కాలరాస్తోంది: మంత్రి కేటీఆర్‌

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని తొలగించిన 35వేల మందిని ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

Published : 15 Mar 2023 20:50 IST

హైదరాబాద్‌: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో తొలగించిన 35వేల మంది ఓటర్లను తిరిగి జాబితాలో చేర్చాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి, భారాస కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ (Minister KTR) కోరారు. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు ఆయన లేఖ రాశారు. కంటోన్మెంట్ పరిధిలో రక్షణశాఖ ఆధ్వర్యంలో ఉన్న స్థలంలో అక్రమంగా నివసిస్తున్నారన్న అర్థం లేని కారణంతో, అర్హత కలిగిన వారిని కూడా ఓటర్ల జాబితా నుంచి తొలగించారని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కంటోన్మెంట్ బోర్డు పరిధిలో శాశ్వతంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారి హక్కులకు భంగం కలిగించేలా, అక్రమంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించారని ఆరోపించారు. ఓటర్లకు, వారి కుటుంబాలకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వకుండా ఓటర్ల జాబితా నుంచి తొలగించారని మంత్రి తెలిపారు. 

భారతదేశ పౌరులుగా తెలంగాణ రాష్ట్రంలో శాశ్వతంగా నివాసముంటున్న వీరి ఉనికిని ప్రశ్నార్థకం చేసేలా, వారికి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును దూరం చేయడం దారుణమని కేటీఆర్‌ ఆక్షేపించారు. కంటోన్మెంట్ బోర్డుకు, విద్యుత్ శాఖకు, నీటి సరఫరా శాఖకు బాధ్యత కలిగిన పౌరులుగా దశాబ్దాలుగా వీరు పన్నులు, బిల్లులు చెల్లిస్తున్నారన్నారని వెల్లడించారు. గతంలోనూ కంటోన్మెంట్ బోర్డు, శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటుహక్కు వినియోగించుకున్నారని గుర్తు చేశారు. అక్రమంగా నివాసం ఉంటున్నారని కంటోన్మెంట్ బోర్డు చెప్పిన కారణం సహేతుకంగా లేదన్న మంత్రి కేటీఆర్.. ఇప్పటి దాకా దేశంలోని ఏ న్యాయస్థానం కానీ, స్వయంగా కంటోన్మెంట్ బోర్డు కానీ వీరు అక్రమంగా నివసిస్తున్నారని అధికారికంగా తేల్చలేదన్నారు. 2018లో 1,91,849 ఓటర్లు ఉంటే ఇవాళ ఆ సంఖ్య 1,32,722కు తగ్గడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి అన్యాయమైన పరిస్థితులు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నెలకొన్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని 35వేల మంది ఓటర్లకు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములయ్యే అవకాశాన్ని కల్పించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని