MLAs bribery case: ఎమ్మెల్యేలకు ఎర కేసు.. ముగ్గురు నిందితుల కస్టడీ పిటిషన్‌ కొట్టివేత

ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురి నిందితుల కస్టడీ పిటిషన్‌ను అవినీతి నిరోధక శాఖ (అనిశా) ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ముగ్గురు నిందితులను ఇదివరకే రెండ్రోజుల కస్టడీకి అనుమతించామని.. మరోసారి కస్టడీకి ఇవ్వడం కుదరని సిట్ అధికారులకు తేల్చి చెప్పింది.

Published : 24 Nov 2022 16:26 IST

హైదరాబాద్‌: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ముగ్గురి నిందితుల కస్టడీ పిటిషన్‌ను అవినీతి నిరోధక శాఖ (అనిశా) ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. ముగ్గురు నిందితులను ఇదివరకే రెండ్రోజుల కస్టడీకి అనుమతించామని.. మరోసారి కస్టడీకి ఇవ్వడం కుదరని సిట్ అధికారులకు తేల్చి చెప్పింది. ఈ కేసుకు సంబంధించి విచారణ జరిపి మరింత సమాచారం తెలుసుకోవడానికి సిట్‌ అధికారులకు ఇంతకుముందే రెండ్రోజుల అనుమతిచ్చింది. ఈనెల 10, 11 తేదీల్లో ముగ్గురి నిందితులను కస్టడీలోకి తీసుకొని సిట్‌ అధికారులు పలు విషయాలపై ప్రశ్నించారు. ఇందులో భాగంగా కొంత సమాచారం సేకరించారు. అయితే, ఆ సమాచారం సరిపోదని దర్యాప్తులో భాగంగా కొన్ని ముఖ్య విషయాలు వెల్లడయ్యాయని వాటికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకోవాలని మరో ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు.

ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో నిందితులు డబ్బు ఎక్కడ్నుంచి సమీకరించాలనుకున్నారు? సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌, ఇతరత్రా ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు స్వాధీనం చేసుకుని.. వాటిలోంచి కొంత సమాచారాన్ని సిట్‌ అధికారులు సేకరించారు. ఈ సమాచారానికి సంబంధించి ముగ్గురు నిందితుల్ని ప్రశ్నించాల్సి ఉందని సిట్‌ అధికారులు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. అయితే,  ఇప్పటికే రెండ్రోజులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారని నిందితుల తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసులో పెట్టిన సెక్షన్లు పూర్తిగా తప్పని.. కేవలం రాజకీయ కారణాలతోనే నిందితులపైన కేసులు నమోదు చేశారని తెలిపారు. వీరిని అనవసరంగా 25రోజులకు పైగా చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా ఉంచారని.. కస్టడీకి మరోసారి అనుమతించొద్దని న్యాయస్థానాన్ని కోరారు. ఈ వాదనలకు ఏకీభవించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు.. నిందితులను ఐదు రోజుల కస్టడీకి ఇవ్వడానికి నిరాకరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని