Grama Sabha: ‘ప్రజాపాలన’కు ఏర్పాట్లు పూర్తి చేయండి.. అధికారులకు దానకిశోర్‌ ఆదేశం

‘ప్రజాపాలన’లో భాగంగా ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్డు సభలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ అధికారులను ఆదేశించారు.

Published : 25 Dec 2023 20:18 IST

హైదరాబాద్: ‘ప్రజాపాలన’లో భాగంగా ఈ నెల 28వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వార్డు సభలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్ అధికారులను ఆదేశించారు. పురపాలక శాఖ సంచాలకులు హరిచందన, మున్సిపల్ కమిషనర్లతో సోమవారం ఆయన సమావేశమై ‘ప్రజాపాలన’ సన్నద్ధతపై సమీక్షించారు. దరఖాస్తుల స్వీకరణ, వాటికి రసీదు ఇవ్వడం, కంప్యూటరీకరణ చేయడం, తదితర అవసరమైన పనుల కోసం బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వార్డు సభల తేదీలను పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని చెప్పారు. ప్రజా ప్రతినిధులను భాగస్వామ్యం చేసుకొని ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంపై ఏ రోజుకు ఆరోజు నివేదికను రాష్ట్ర కార్యాలయానికి పంపించాలన్నారు.

కాగా, ఈ నెల 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ‘ప్రజాపాలన’ కార్యక్రమం జరగనుంది. ప్రతి పట్టణం, గ్రామం, తండాలో ప్రజాపాలన నిర్వహించనున్నారు. అధికారులు ప్రతి రోజు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక గ్రామంలో, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరో గ్రామంలో సభలు నిర్వహిస్తారు. ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ఈ గ్రామసభల్లో స్వీకరించి రసీదు ఇస్తారు. దరఖాస్తులను నింపడానికి ఇబ్బంది లేకుండా 28వ తేదీకి ఒకట్రెండు రోజుల ముందే ప్రజలకు ఫాంలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని