PeddaVahanaSeva: ప్రారంభమైన తిరుమల బ్రహ్మోత్సవాలు.. వైభవంగా శ్రీవారి పెదశేష వాహనసేవ

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కొవిడ్ కారణంగా

Updated : 27 Sep 2022 21:51 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. కొవిడ్ కారణంగా రెండేళ్లుగా ఏకాంతంగా నిర్వహించిన బ్రహ్మోత్సవాలను ఈసారి భక్తజన సందోహం మధ్య నిర్వహిస్తున్నారు. రెండేళ్ల తర్వాత మాడవీధుల్లో విహరిస్తోన్న స్వామివారిని దర్శించుకొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇవాళ సాయంత్రం ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రతీతి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారి వాహన సేవలను ప్రారంభించారు. కలియుగ వైకుంఠ నాథుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు జరిగే పండుగే పెద శేషవాహన ఉత్సవం. ఆద్యంతం కన్నుల పండువగా సాగిన ఈ సేవలో శ్రీనివాసుడు శేషతల్పంపై అధిష్ఠించి భక్తులకు దర్శనమిచ్చారు. తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, తితిదే పాలకమండలి సభ్యులు, విశేష సంఖ్యలో భక్తులు వాహన సేవలో పాల్గొన్నారు. స్వామి కొలువై ఉన్న కొండ శేషాద్రి. అందుకే తొలిరోజు పెద శేష వాహనంపై నుంచి భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. విషోగ్రుడైన శేషుని అధిష్ఠించిన దేవదేవుడు మానవుల్లోని కల్మశాన్ని హరిస్తాడన్నది ఈ సేవలోని అంతరార్థం. తిరు ఆభరణాల అలంకృతుడై ఉభయ దేవేరులతో కలగలిసి వీనులవిందు చేసే మలయప్పను దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని