Pfizer: 5-11 ఏళ్లలోపు చిన్నారులకు ఫైజర్‌ టీకా సురక్షితం

ఐదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు చిన్నారుల విషయంలో తాము రూపొందించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైందని ఫైజర్, బయోఎన్‌టెక్‌ సంస్థలు సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. వారికి ఈ టీకాలు సురక్షితమని వెల్లడించాయి...

Updated : 21 Sep 2021 05:05 IST

ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ సంయుక్త ప్రకటనలో వెల్లడి

న్యూయార్క్‌: ఐదేళ్ల నుంచి 11 ఏళ్లలోపు చిన్నారుల విషయంలో తాము రూపొందించిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైందని ఫైజర్, బయోఎన్‌టెక్‌ సంస్థలు సోమవారం ఓ సంయుక్త ప్రకటనలో తెలిపాయి. వారికి ఈ టీకాలు సురక్షితమని వెల్లడించాయి. డెల్టా వేరియంట్‌ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో చిన్నారులకూ మహమ్మారి నుంచి రక్షణ అందించేందుకు ఎదురుచూస్తున్నామని ఫైజర్ ఛైర్మన్, సీఈవో ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. ‘జులై నుంచి అమెరికావ్యాప్తంగా చిన్నారుల్లో కొవిడ్‌ కేసులు దాదాపు 240 శాతం పెరిగాయి. ఈ ప్రమాదకర పరిస్థితి.. టీకా ఆవశ్యకతను తెలుపుతోంద’న్నారు.

2,268 మందిపై క్లినికల్‌ ట్రయల్స్‌

క్లినికల్‌ ట్రయల్స్‌లో భాగంగా 5- 11 ఏళ్ల మధ్య వయస్సుగల 2,268 మంది చిన్నారులకు రెండు డోసుల టీకా ఇచ్చారు. 12 ఏళ్లు దాటినవారికి ఇస్తున్న మోతాదుతో పోల్చితే కొంత తక్కువ ఇచ్చారు. ఈ క్రమంలో వారిలో టీకా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలిందని చెప్పారు. పెద్ద మొత్తంలో యాంటీబాడీలనూ ఉత్పత్తి చేసిందని తెలిపారు. ఈ ట్రయల్స్‌ వివరాలను త్వరలో అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌డీఏ), యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ, ఇతర దేశాల ఔషధ నియంత్రణ సంస్థలకు సమర్పిస్తామని, అమెరికాలో అత్యవసర వినియోగానికి దరఖాస్తు చేస్తామని బౌర్లా తెలిపారు. ప్రస్తుతం 2-5 ఏళ్లు, ఆరు నెలల నుంచి రెండేళ్ల వయస్సు మధ్య చిన్నారులపై ట్రయల్స్‌ జరుగుతున్నాయని, ఏడాది చివరినాటికి ఫలితాలు రావొచ్చని ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ వెల్లడించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని