Hyderabad Rains: జీహెచ్‌ఎంసీలో పలుచోట్ల వడగళ్ల వాన.. మరో రెండు రోజులూ వర్షాలే..!

Hyderaba rains: హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారి చల్లబడింది. వాతావరణంలో మార్పులతో నగరంలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది.

Updated : 16 Mar 2023 16:27 IST

హైదరాబాద్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ (GHMC) పరిధిలో పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం (Hyderabad rains) కురిసింది. ఈ వర్షాలతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. కొన్ని చోట్ల ఆకాశంలో మెరుపులు.. మేఘాల గర్జనలకు జనం భయపడుతున్నారు. నగరంలోని గచ్చిబౌలి, యూసుఫ్‌గూడ, సోమాజీగూడ, అమీర్‌పేట, కూకట్‌పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, కాటేదాన్‌, రాజేంద్రనగర్‌, హయత్‌నగర్‌, పెద్ద అంబర్‌పేట తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు, చేవెళ్ల నియోజకవర్గంలో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షం కురిసింది. పశ్చిమ బెంగాల్‌ నుంచి ఝార్ఖండ్‌ మీదుగా ఒడిశా వరకు ద్రోణి ఏర్పడటం.. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకణ్‌ తీరం వరకూ మరో ద్రోణి ప్రభావంతో బంగాళాఖాతం నుంచి రాష్ట్రం వైపు తేమ గాలులు వీస్తున్నాయి. (Hyderabad News)

రహదారిపై పేరుకుపోయిన వడగళ్లు..

ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా కొన్నిచోట్ల తేలికపాటు నుంచి మోస్తరు వర్షాలు; శుక్ర, శనివారాల్లో చాలా చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురవచ్చని అంచనావేసింది. ఈ సమయంలో గాలులు వేగం గంటకు 30 నుంచి 40కి.మీల మేర ఉండటంతో పాటు వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇంకోవైపు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్, మారేడుపల్లి, చిలకలగూడ, సీతాఫల్‌మండీ, అల్వాల్‌, తిరుమల గిరి, ప్యాట్నీ, ప్యారడైజ్‌ తదితర ప్రాంతాల్లో ఆకాశంలో దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలంలో భారీగా వడగళ్ల వాన కురిసింది. పలు చోట్ల రహదారులపై వడగళ్లు పేరుకుపోయాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని