Telangana News: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్‌ ప్రకటించిన ప్రభుత్వం

తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.

Updated : 23 May 2023 22:26 IST

హైదరాబాద్‌: తెలంగాణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పదేళ్ల తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని ప్రజలకు వివరించడంతో పాటు ప్రజోపయోగ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర యంత్రాంగం, ప్రజా ప్రతినిధులు ప్రణాళికలు రూపొందించారు. జూన్‌ 2 తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు నుంచి 20 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు రూపకల్పన చేశారు. అందుకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రభుత్వం మంగళవారం విడుదల చేసింది.

* జూన్ 2.. ఉత్సవాలు ప్రారంభం

దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. జూన్ 2న హైదరాబాద్‌లోని అమరవీరుల స్తూపం వద్ద సీఎం నివాళులర్పిస్తారు. అనంతరం, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం దశాబ్ది ఉత్సవ సందేశాన్నిస్తారు. అదే రోజున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో జాతీయ పతాక వందనం, దశాబ్ది ఉత్సవ సందేశాలు తదితర కార్యక్రమాలుంటాయి.

* జూన్ 3.. తెలంగాణ రైతు దినోత్సవం

ఈ రోజును ‘తెలంగాణ రైతు దినోత్సవం’గా జరుపుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని రైతు వేదికల కేంద్రంగా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సాధించిన విజయాలు, ఉచిత విద్యుత్తు, రైతు బంధు, రైతు బీమా తదితర పథకాల విశిష్టతను తెలియజేసే కార్యక్రమాలుంటాయి. అనంతరం ప్రజా ప్రతినిధులు, అధికారులు రైతులందరితో కలిసి సామూహికంగా భోజనాలు చేస్తారు.

* జూన్ 4.. సురక్షా దినోత్సవం

పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘సురక్షా దినోత్సవం’ నిర్వహిస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని, ఫ్రెండ్లీ పోలీస్ విధానాన్ని, రాష్ట్ర పోలీసు శాఖ ఉత్తమ సేవలను వివరించే విధంగా రాష్ట్ర, జిల్లాల స్థాయిలో కార్యక్రమాలుంటాయి.

జూన్ 5.. తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం

ఈ రోజు ‘తెలంగాణ విద్యుత్తు విజయోత్సవం’ పేరిగ కార్యక్రమాలను జరుపుతారు. నియోజకవర్గాల స్థాయిలో రైతులు, వినియోగదారులు, విద్యుత్ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. విద్యుత్ రంగంలో రాష్ట్రం సాధించిన గుణాత్మక మార్పును సభల్లో వివరిస్తారు. సాయంత్రం హైదరాబాద్ రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహిస్తారు. ఇదేరోజు సింగరేణి సంబురాలు జరుపుతారు.

* జూన్ 6.. తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం

‘తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవం’ పేరిట కార్యక్రమాలు ఉంటాయి. ఈ రోజున పారిశ్రామిక వాడలు, ఐటీ కారిడార్లలో సభలు నిర్వహిస్తారు. ఆయా రంగాల్లో సాధించిన ప్రగతిని వివరిస్తారు.

* జూన్ 7.. సాగునీటి దినోత్సవం

సాగునీటి రంగంలో రాష్ట్రం సాధించిన రికార్డు స్థాయి ప్రగతిని వివరిస్తూ ప్రతి నియోజకవర్గంలో ‘సాగునీటి దినోత్సవ’ సభలు నిర్వహిస్తారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో నీలిపారుదల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ సాగునీటి రంగంలో సాధించిన విజయాలపై సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్‌ హాజరవుతారు.

* జూన్ 8.. ఊరూరా చెరువుల పండుగ

ఈ రోజున ‘ఊరూరా చెరువుల పండుగ’ను నిర్వహిస్తారు. డప్పులు, బోనాలు, బతుకమ్మలతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి. గోరటి వెంకన్న రాసిన   చెరువు పాటలు సహా చెరువుల మీద ఇతర కవులు రాసిన పాటలను వినిపిస్తారు. మత్స్యకారుల వలల ఊరేగింపులతో ఘనంగా నిర్వహిస్తారు. చెరువు కట్టలపై సభలు ఉంటాయి. నాయకులు, ప్రజలు కలిసి చెరువు కట్టమీద సహపంక్తి భోజనాలు చేస్తారు.

* జూన్ 9.. తెలంగాణ సంక్షేమ సంబురాలు

‘తెలంగాణ సంక్షేమ సంబురాలు’ జరుపుతారు. నియోజకవర్గ స్థాయిలో ప్రభుత్వం అందించిన ఆసరా పింఛన్లు, కల్యాణ లక్ష్మి తదితర సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సభలు నిర్వహిస్తారు. తెలంగాణ సంక్షేమంలో స్వర్ణయుగం సాధించిన తీరును, దేశానికి దిక్సూచిగా మారిన తీరును వివరిస్తూ రవీంద్ర భారతిలో సభ ఉంటుంది.

* జూన్ 10..తెలంగాణ సుపరిపాలన దినోత్సవం

‘తెలంగాణ సుపరిపాలన దినోత్సవం’ పేరిట అన్ని జిల్లా కేంద్రాల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలో పరిపాలన సంస్కరణల ద్వారా ప్రభుత్వ వ్యవస్థలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో కలిగిన మేలును తెలియజేస్తారు.

* జూన్‌ 11.. తెలంగాణ సాహిత్య దినోత్సవం

 ‘‘తెలంగాణ సాహిత్య దినోత్సవం’’ సందర్భంగా జిల్లాస్థాయిలో కవి సమ్మేళనాలు, రవీంద్రభారతిలో రాష్ట్ర స్థాయి కవి సమ్మేళనం ఉంటుంది. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ సాధించిన ప్రగతి ప్రతిబింబించేలా జిల్లా, రాష్ట్రస్థాయిలో కవితల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు.

* జూన్‌ 12.. తెలంగాణ రన్‌..

 అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో యువకులు, విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు, అధికారులతో ఉదయం 6 గంటలకు తెలంగాణ రన్ కార్యక్రమాన్ని పోలీసుశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు.

* జూన్ 13.. తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం

‘‘తెలంగాణ మహిళా సంక్షేమ దినోత్సవం’’ సందర్భంగా మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి సమావేశంలో వివరిస్తారు.  ఉత్తమ మహిళా ఉద్యోగులకు సన్మానం చేస్తారు.  

*జూన్ 14.. తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవం

రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వైద్యారోగ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యరంగంలో జరిగిన విప్లవాత్మక అభివృద్ధి సమాచారాన్ని, సందేశాలను ప్రజలకు తెలియజేస్తారు. ప్రభుత్వం అనుసరిస్తున్న వైద్య విధానాల ద్వారా ప్రజలకు చేకూరుతున్న లబ్ది గురించి వివరిస్తారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తారు.  హైదరాబాద్  నిమ్స్‌లో 2 వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానా నూతన భవన నిర్మాణానికి, నిమ్స్ విస్తరణ పనులకు  ముఖ్యమంత్రి  కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్నారు.

* జూన్‌ 15.. తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం..

 ‘‘తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం’’  సందర్భంగా..  దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ పల్లెలు సాధించిన ప్రగతిని తెలిపే పలు కార్యక్రమాలుంటాయి. అవార్డు సాధించిన ఉత్తమ గ్రామ పంచాయతీల సర్పంచులకు, ఉత్తమ మండలాల ఎంపీపీలకు సన్మానం చేస్తారు.

* జూన్ 16.. తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం..

‘‘తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవం’’ సందర్భంగా.. పట్టణ ప్రగతి ద్వారా ప్రతి కార్పొరేషన్, మున్సిపాలిటీలు, పట్టణాలు సాధించిన ప్రగతిని, రాష్ట్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రజలకు చేకూరిన లబ్ధిని తెలిపేలా కార్యక్రమాలుంటాయి.

* జూన్ 17.. తెలంగాణ గిరిజనోత్సవం..

 ‘‘తెలంగాణ గిరిజనోత్సవం’’ సందర్భంగా.. నూతనంగా ఏర్పడిన గిరిజన గ్రామాల్లో సభలు నిర్వహిస్తారు. గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరిస్తారు.

* జూన్ 18న తెలంగాణ మంచినీళ్ల పండుగ..

సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ఎదుర్కొన్న తాగునీటి ఎద్దడి నుంచి.. నేడు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలు బిగించి ఉచితంగా స్వచ్ఛమైన, సురక్షితమైన నీటిని సరఫరా చేస్తున్న తీరును వివరించే కార్యక్రమాలు ఉంటాయి. 

* జూన్ 19న తెలంగాణ హరితోత్సవం..

 ‘‘తెలంగాణ హరితోత్సవం’’ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహిస్తారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచడానికి పెద్ద ఎత్తున జరిగిన కృషిని, తద్వారా అడవులు పెరిగిన తీరును వివరిస్తారు.

* జూన్‌ 20న.. తెలంగాణ విద్యాదినోత్సవం..

 రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల విద్యా సంస్థల్లో  సభలు నిర్వహిస్తారు. విద్యారంగంలో తెలంగాణ సాధించిన విజయాలను వివరిస్తారు. అదేరోజున ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న మన ఊరు మన బడి పాఠశాలల ప్రారంభిస్తారు. అదే సందర్భంలో సిద్ధమైన 10 వేల గ్రంథాలయాలను, 1,600 డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ప్రారంభిస్తారు. విద్యార్ధులకు వ్యాసరచన, చిత్రలేఖనం, పాటల పోటీలు నిర్వహిస్తారు. 

* జూన్ 21న.. తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం

 ‘‘తెలంగాణ ఆధ్యాత్మిక దినోత్సవం’’  సందర్భంగా  దేవాలయాలు, మసీదులు, చర్చిలు, ఇతర  ప్రార్ధనా మందిరాల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి.

* జూన్ 22.. అమరుల సంస్మరణ కార్యక్రమం

తెలంగాణ వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు, నగరాలు, విద్యాలయాల్లో అమరులకు శ్రద్ధాంజలి ఘటించి, మౌనం పాటిస్తారు. అమరుల సంస్మరణ తీర్మానాలు చేస్తారు. ఈ సందర్భంగా అమరుల త్యాగాలను స్మరిస్తారు. హైదరాబాద్‌ లో అమరుల గౌరవార్థం ట్యాంక్ బండ్ పై కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తారు. హైదరాబాద్ లో నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరిస్తారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల్లో ఉదయం అమరవీరుల స్థూపాల వద్ద శ్రద్ధాంజలి ఘటించి, సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించే సభలో పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని