TS News: 20 ఏళ్ల తర్వాత దిల్లీలో కేసీఆర్‌ అధికారిక నివాసం నేమ్‌ ప్లేట్‌ మార్పు

దిల్లీ తుగ్లక్‌ రోడ్డు నివాసం వద్ద కేసీఆర్‌ పేరుతో ఉన్న నేమ్‌ ప్లేట్‌ను అధికారులు మార్చారు.

Updated : 19 Dec 2023 17:30 IST

దిల్లీ: దిల్లీ తుగ్లక్‌ రోడ్డు నివాసం వద్ద కేసీఆర్‌ పేరుతో ఉన్న నేమ్‌ ప్లేట్‌ను అధికారులు మార్చారు. గత 20 ఏళ్లుగా తుగ్లక్‌ రోడ్డులోని 23వ నెంబరు బంగ్లా కేసీఆర్‌ అధికారిక నివాసంగా ఉండేది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్‌ ఆ బంగ్లాను ఖాళీ చేశారు. ఆయన వ్యక్తిగత వస్తువులను సిబ్బంది వేరే చోటకి తరలించారు. 

2004 నుంచి 2014 వరకు ఎంపీగా, మంత్రిగా తుగ్లక్‌ రోడ్డు నివాసం నుంచే కేసీఆర్‌ కార్యకలాపాలు నిర్వహించారు. ఆ తర్వాత 2014 నుంచి 2023 డిసెంబరు తొలివారం వరకు అదే బంగ్లా ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్‌ అధికారిక నివాసంగా ఉంది. ఎన్నికల ఫలితాల అనంతరం కేసీఆర్‌ సిబ్బంది.. బంగ్లాను ఖాళీ చేసి తెలంగాణ భవన్‌ అధికారులకు అప్పగించారు. తుగ్లక్‌ రోడ్డులోని బంగ్లా దాదాపు 20 ఏళ్ల పాటు కేసీఆర్‌ అధికారిక నివాసంగా ఉంది. సీఎంగా ప్రమాణ స్వీకారం తర్వాత మంగళవారం తొలి సారిగా ఈ బంగ్లాను రేవంత్‌రెడ్డి సందర్శించారు. ఎంఎస్‌ ఫ్లాట్స్‌ యమున అపార్ట్‌మెంట్‌లో 902 ఫ్లాట్‌ ప్రస్తుతం రేవంత్‌ నివాసంగా ఉంది. త్వరలో ఆయన ఆ ఫ్లాట్‌ను ఖాళీ చేయనున్నట్టు సమాచారం. తుగ్లక్‌రోడ్డు బంగ్లాలో మార్పుల చేర్పుల తర్వాత పూజ చేసి అధికారికంగా బంగ్లాను వినియోగించుకోవాలనే యోచనలో రేవంత్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని