మరణాల ముప్పు పురుషుల్లోనే అధికం!

యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో అదే వయసు మహిళలతో పోలిస్తే మరణం ముప్పు దాదాపు 60శాతం ఎక్కువని తాజా అధ్యయనం వెల్లడించింది.

Updated : 16 Mar 2021 04:03 IST

50ఏళ్ల పైబడిన వారిలో 60శాతం ఎక్కువ మరణాలు

లండన్‌: మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే మరణాల ముప్పు అధికంగా ఉంటుందని తాజాగా మరో పరిశోధన వెల్లడించింది. యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో అదే వయసు మహిళలతో పోలిస్తే మరణం ముప్పు దాదాపు 60 శాతం ఎక్కువని కనుగొంది. ధూమపానం, హృద్రోగం వంటి సమస్యలు దీనికి కారణమవుతున్నాయని విశ్లేషించింది. స్త్రీ, పురుష మరణాల్లో వ్యత్యాసం, కారణాలపై జరిపిన ఈ అధ్యయన నివేదిక కెనడియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ జర్నల్‌లో ప్రచురితమైంది.

50ఏళ్లు వయసు మీరిన వారిలో పురుషులు, మహిళల మరణాల మధ్య తేడా ఏవిధంగా ఉందో తెలుసుకునేందుకు లండన్‌ పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. అధ్యయనంలో భాగంగా, వివిధ దేశాల్లో స్త్రీ పురుషుల్లో సంభవిస్తున్న మరణాల వయసులో వ్యత్యాసం వేరువేరుగా ఉన్నట్లు గుర్తించారు. ఇందుకు ఆయా దేశాల్లోని సామాజిక, ఆర్థిక, జీవన విధానం వంటి అంశాలు కారణమని లండన్‌లోని కింగ్స్‌ కాలేజీకి చెందిన ప్రొఫెసర్‌ యూ-జూ వూ వెల్లడించారు. వారివారి సంప్రదాయాలు, సామాజిక ఆర్థిక పరిస్థితులు ఆయా దేశాల స్త్రీ, పురుషుల ఆరోగ్యంపై ఎక్కువగానే చూపించే అవకాశం ఉందన్నారు.

28 దేశాల్లోని దాదాపు లక్షా 79వేల మందిపై ఈ అధ్యయనం చేపట్టగా.. వీరిలో 55 శాతం మంది మహిళలే ఉన్నారు. జీవనసరళి, సామాజిక ఆర్థిక పరిస్థితులు, ఆరోగ్యంతో పాటు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని సమాచారాన్ని విశ్లేషించారు. ఇలా యాభై ఏళ్లు పైబడిన పురుషుల్లో మహిళలతో పోలిస్తే 60 శాతం అధికంగా మరణాలు చోటుచేసుకుంటున్నాయని పరిశోధకులు గుర్తించారు. ధూమపానం వంటి అలవాట్లు పురుషుల్లో అనారోగ్యానికి కారణమవుతున్నట్లు పరిశోధకులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా హుద్రోగ సమస్యలు కూడా పురుషుల్లో తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజారోగ్య విధానాలు నిర్ణయించే సమయంలో స్త్రీ, పురుషుల ఆరోగ్యం, వారి ఆయుర్దాయంలో తేడాలు, సామాజిక సాంస్కృతిక అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సిన అవరసం ఎంతైనా ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని