ఐదేళ్లలో 50 వేల స్టార్టప్‌లు

 దేశంలో స్టార్టప్‌ల ఒరవడి కొనసాగుతోంది.  ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 50 వేల స్టార్టప్‌లను స్థాపించడమే ఇందుకు నిదర్శనం. డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ) ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది.

Published : 04 Jun 2021 01:06 IST

అగ్రస్థానంలో దిల్లీ, కర్ణాటక
45 శాతం స్టార్టప్‌ల నాయకత్వ బృందాలలో మహిళా పారిశ్రామికవేత్తలు

ఇంటర్నెట్ డెస్క్‌:  దేశంలో స్టార్టప్‌ల ఒరవడి కొనసాగుతోంది.  ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 50 వేల స్టార్టప్‌లను స్థాపించడమే ఇందుకు నిదర్శనం. డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ప్రమోషన్‌ ఆఫ్‌ ఇండస్ట్రీ అండ్‌ ఇంటర్నల్‌ ట్రేడ్‌(డీపీఐఐటీ) ఈ మేరకు గణాంకాలను విడుదల చేసింది. ఎక్కువ సంఖ్యలో స్టార్టప్‌ల స్థాపనతో దిల్లీ, కర్ణాటకలు అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌లు నిలిచినట్లు ఆ గణాంకాల ద్వారా తెలుస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం  45 శాతం స్టార్టప్‌ల నాయకత్వ బృందాలలో మహిళా పారిశ్రామికవేత్తలు ఉండటం గమనార్హం. ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌, అప్లికేషన్‌ డెవలప్‌మెంట్‌, ఐటీ కన్సల్టింగ్‌ రంగాల్లో ఎక్కువ స్టార్టప్‌లు నమోదయ్యాయి.  గురువారం నాటికి డీపీఐఐటీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 2020 ఏప్రిల్‌ 1 నుంచి 19,896 స్టార్టప్‌లు గుర్తింపు పొందాయి. 2016లో స్టార్టప్‌ ఇండియా కార్యక్రమం ప్రారంభం అయినప్పటి నుంచి దేశవ్యాప్తంగా 623 జిల్లాలకు ఈ స్టార్టప్‌లు విస్తరించాయి.
 కేంద్రపాలిత ప్రాంతాలు సహా ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక స్టార్టప్ ఉంది. స్టార్టప్‌ల ప్రారంభానికి బీజం పడిన తొలి ఏడాది కాలంలో 743 అంకురాలను స్థాపించగా.. 2020-2021 మధ్య కాలంలో 16 వేల అంకురాలను స్థాపించినట్లు గుర్తించారు.  ప్రారంభంలో 10 వేల స్టార్టప్‌లను స్థాపించడానికి 808 రోజుల సమయం పడితే.. ప్రస్తుతం 180 రోజుల్లోనే 10 వేల మార్కును చేరుకుంటున్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి.  ఔత్పాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్పహించడంలో భాగంగా స్థాపించిన స్టార్టప్‌లు ఇప్పుడు ఉద్యోగ కల్పనలోనూ కీలకంగా మారాయని డీపీఐఐటీ తెలిపింది. 48,093 స్టార్టప్‌లు ఇప్పటివరకు 5,49,842 ఉద్యోగాలను సృష్టించినట్లు పేర్కొంది. అంటే ఒక్కో స్టార్టప్‌ సగటున 11 ఉద్యోగాలను సృష్టించినట్టు వివరించింది. కేవలం 2020-2021 మధ్య కాలంలో స్థాపించిన అంకురాల ద్వారానే 1.7 లక్షల కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చినట్టు తెలిపింది.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని