Updated : 23 Aug 2020 08:59 IST

విమానం కోసం అమ్మ పుస్తెలతాడు తాకట్టు! 

గాల్లో ఎగిరే విమానం చూసినప్పుడు కొందరు దాన్ని దగ్గర నుంచి చూడాలనుకుంటారు. కొందరు ఆ విమానం ఎక్కాలనుకుంటారు. ఇంకొందరు దాన్ని నడపాలని ఆశ పడతారు. ఇలా ఎవరి అభిప్రాయాలు, కోరికలు, ఊహలు వారికి ఉండడం సహజం. కానీ, ఓ విమానం చూసినప్పుడు.. ‘‘నేనూ ఇలాంటి విమానాన్ని నడుపుతా. సొంతంగా తయారు చేస్తా ’’ అని మీరంటే మీ పక్కనున్న వాళ్లు అనుమానంగా ఓ లుక్కేసి ‘నీకంత సీన్‌ ఉందా’ అనేస్తారు. మరికొందరు ‘వీడికేదో పట్టింది’ అంటూ అక్కడి నుంచి పారిపోతారు. కానీ, అతడు మాత్రం అలాంటివేవీ పట్టించుకోలేదు. తన ఇంటి మిద్దెనే ప్రయోగశాలగా మార్చుకుని ఏకంగా విమానాన్ని రూపొందించాడు. ఇటీవలే తొలిసారిగా గగనవిహారం చేయించి.. రెండో దశ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. దేశీయంగా విమానాలను తయారు చేయాలన్న తన రెండు దశాబ్దాల  కలను నెరవేర్చుకునే దిశగా ముందుకు సాగుతున్నాడు. అతడే మహారాష్ట్రకు చెందిన కెప్టెన్‌ అమోల్‌ యాదవ్‌.


బీజం పడింది అక్కడే..

ముంబయిలోని చర్కాప్‌ ప్రాంతంలో నివసించే అమోల్‌ యాదవ్‌ది ఉమ్మడి కుటుంబం. మొత్తం 19 మంది కుటుంబ సభ్యులు. జెట్‌ ఎయిర్‌వేస్‌ మాజీ పైలట్‌. 19 ఏళ్ల వయసులో కమర్షియల్‌ పైలట్‌ శిక్షణ కోసం అమెరికా వెళ్లాడు. అక్కడే విజయవంతంగా పైలట్‌ శిక్షణ పూర్తి చేసుకున్నాడు. అప్పుడే సొంతంగా ఎందుకు విమానం తయారు చేయకూడదన్న ఆలోచన అతడి మదిలో మెదిలింది. అదే ఆశతో భారత్‌లో అడుగుపెట్టాడు. ఇక్కడకు వచ్చాక తన కలను కుటుంబ సభ్యులు, స్నేహితులతో పంచుకున్నాడు.


తొలి రెండు ప్రయత్నాల్లో విఫలం

కుటుంబ సభ్యుల సాయంతో 1998లో తొలిసారి రెండు సీట్ల ఎయిర్‌క్రాఫ్ట్‌ను రూపొందించాడు అమోల్‌. అయితే సాంకేతిక కారణాల వల్ల అది సాధ్యం కాలేదు. 1999లో మరో రెండు సీట్ల విమానాన్ని రూపొందించేందుకు నడుం బిగించాడు. దాన్ని 2003లో పూర్తి చేశాడు. ఇతర కారణాల వల్ల అది కూడా ఆగిపోయింది. అయినా, విమానాన్ని రూపొందించాలన్న పట్టుదలతో 2010లో ‘టీఏసీ 003’ విమానాన్ని మొదలు పెట్టాడు. 2016 నాటికి దాన్ని పూర్తిచేశాడు. అదే ఏడాది నిర్వహించిన మేకిన్‌ ఇండియా ఎగ్జిబిషన్‌లో దీన్ని ప్రదర్శనకు ఉంచాడు. దేశీయంగా తయారైన తొలి విమానంగా దీనికి మంచి గుర్తింపు లభించించింది.


మోదీ చొరవతో అనుమతులు

దేశీయ విమానాన్ని రూపకల్పన చేసి, దాన్ని విజయవంతంగా ప్రదర్శించినప్పటికీ అమోల్‌కు కష్టాలు తప్పలేదు. విమానం ఎగిరేందుకు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ యావియేషన్‌ (డీజీసీఏ) అనుమతులు రావడంలో ఆలస్యం జరిగింది. అయితే, అప్పటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయంలో అమోల్‌కు అండగా నిలిచారు. ఈ విషయమై ప్రధానితో మాట్లాడారు. దీంతో అమోల్‌ ప్రధానితో నేరుగా కలిశారు. తన కలల ప్రాజెక్టు గురించి వివరించాడు. అమోల్‌ కృషిని కొనియాడుతూ పీఎంవో ట్వీట్‌ చేసింది. అనుమతుల విషయంలో ప్రధాని కార్యాలయం చొరవ చూపింది. దీంతో వారం తిరగకుండానే డీజీసీఏ తొలి దశ అనుమతులు మంజూరు చేసింది.


తొలి దశ విజయవంతం..

డీజీసీఏ అనుమతులు ఇచ్చిన ఏడాది తర్వాత ఈ లోహ విహంగం ఇటీవలే ఆకాశంలోకి రివ్వును ఎగిరింది. ఓ టెక్నీషియన్‌ సాయంతో దీనిపై తొలిదశ పరీక్షలు నిర్వహించినట్లు అమోల్‌ యాదవ్‌ చెప్పాడు. రెండో దశ పరీక్షల్లో ఈ విమానాన్ని 2 వేల అడుగుల ఎత్తులో గగనవిహారం చేయిస్తామన్నాడు. విమానంపై పరీక్షల నిర్వహణకు భారీగా బీమా చేయించాల్సి ఉంటుందని, కుటుంబ సభ్యుల సహకారంతో నిధులు సమకూర్చుకున్నానని అమోల్‌ తెలిపాడు. ఆయనకు అండగా నిలుస్తామని మహారాష్ట్ర సర్కారు సైతం ప్రకటించింది. అమోల్‌ యాదవ్‌ రూపొందించిన ఈ విమానంలో పైలట్‌ సహా ఆరుగురు ప్రయాణించొచ్చు. గరిష్ఠంగా 185 నాట్స్‌ వేగంతో ఇది పయనిస్తుంది. 


అదే నా గోల్‌..

దేశీయంగా విమానం తయారు చేసుకోగల సామర్థ్యం మనకీ ఉందని నమ్ముతాడు అమోల్‌. తాను ఒక్కడే ఒక విమానాన్ని నిర్మించినప్పుడు.. ప్రతి భారతీయుడూ ఇలాంటిది ఏదో ఒకటి సాధించగలడని విశ్వాసం వ్యక్తంచేస్తున్నాడు. విమానాన్ని రూపొందించడంలో తన కుటుంబ సభ్యుల సహకారం మరువలేనిదని చెప్పాడు. తన తొలి విమానానికి ఇంజిన్‌ను కొనుగోలు చేయడానికి అమ్మ తన మంగళ సూత్రాన్ని తాకట్టు పెట్టిందని గుర్తుచేసుకున్నాడు. త్వరలో 19 సీట్ల విమానాన్ని రూపొందిస్తున్నానని చెప్పాడు. అన్నట్లు అమోల్‌ కూడా సొంత విమానాలు తయారు చేసే కంపెనీ ఏర్పాటు చేశాడు. దాని పేరు ‘థ్రస్ట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’. ‘ఎయిర్‌ప్లేన్‌ మేకర్స్‌ ఆఫ్‌ టుమారో’ అనేది దాని ట్యాగ్‌లైన్‌. తన పాత విమాన మోడల్స్‌ సహా.. భవిష్యత్‌లో రూపొందించబోయే విమానాల నమూనాలను తన కంపెనీ వెబ్‌సైట్‌లో పొందుపరిచాడు. అమోల్‌ కోరిక నెరవేరాలని ఆశిద్దాం!!

-ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని