Viveka Murder Case: అవినాష్‌ ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులు నిలిపివేసిన సుప్రీం

వివేకాహత్య కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు పూర్తిగా పక్కన పెట్టింది. ఈ కేసులో సీబీఐ విచారణను జూన్‌ నెలాఖరు వరకు పొడిగించింది.

Updated : 29 Jun 2023 15:44 IST

దిల్లీ: మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి బెయిల్‌ వ్యవహారంపై వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై వాదనలు ముగిశాయి. ఆమె తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, అవినాష్‌ తరఫున మరో సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపించారు. వాదనలు విన్న సీజేఐ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను పూర్తిగా పక్కన పెట్టింది. అవినాష్‌ ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను నిలిపివేసింది. తెలంగాణ హైకోర్టు అలాంటి ఉత్తర్వులు జారీ చేయకూడదని స్పష్టం చేసింది.. సీబీఐకి హైకోర్టు అలాంటి నిబంధనలను విధించడం సరికాదని పేర్కొంది.  హైకోర్టు ఆదేశాల వల్ల సీబీఐ దర్యాప్తుపైనా ప్రభావం పడుతుందన్న సుప్రీం.. జూన్‌ నెలాఖరు వరకు సీబీఐ దర్యాప్తు గడువును పొడిగించింది.

ఈ నెల 25 వరకు అవినాష్‌ను అరెస్టు చేయొద్దంటూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ సునీత సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. గత శుక్రవారం ఈ పిటిషన్‌పై తొలిసారిగా విచారణ చేపట్టిన న్యాయస్థానం హైకోర్టు ఉత్తర్వులను తప్పుబట్టింది. తాజాగా సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. మరోవైపు ఈనెల 25 వరకు అరెస్టు చేయవద్దని అవినాష్‌ న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. మంగళవారం హైకోర్టులో కేసు విచారణ ఉన్నందున అప్పటి వరకు అరెస్టు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ విజ్ఞప్తిని మన్నిస్తే ఉత్తర్వులు పరస్పరం విరుద్ధంగా ఉంటాయన్నారు. మరోవైపు విచారణ సమయంలో నిందితులకు సీబీఐ లిఖితపూర్వక ప్రశ్నలు ఇవ్వాలనడం అసమంజసమని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ అధికారులు ఈ నెల 16న నోటీసులు జారీ చేశారు.  అక్కడికి రెండు రోజుల వ్యవధిలోనే ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, ఉదయకుమార్‌ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేయడంతో.. అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఈ నెల 25 వరకు అరెస్ట్‌ చేయవద్దంటూ సీబీఐని ఆదేశించింది. అయితే అప్పటి వరకు సీబీఐ కార్యాలయంలో ప్రతి రోజూ విచారణకు హాజరుకావాలని అవినాష్‌రెడ్డికి షరతు విధించింది. అవినాష్‌కు ప్రశ్నలను రాతపూర్వకంగా ఇవ్వాలని.. విచారణను ఆడియో, వీడియో రికార్డు చేయాలని సీబీఐకి ఆదేశిస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 25న తుది ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసింది. దీనిపై వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు