Andhra News: ఏమయ్యా రూ.5వేలు ఇస్తానని వెయ్యి ఇస్తావా?.. తహశీల్దార్‌ వీడియో వైరల్‌

‘ఏమయ్యా రూ.5000 ఇస్తానని చెప్పి వెయ్యి రూపాయలు ఇస్తావా? ఇదేనా? అక్కడ ఇచ్చి పని చేసుకు పో..’’ చిత్తూరు జిల్లా పెనుమూరు మండల తహశీల్దార్‌ రమణి ఓ రైతుతో అన్న మాటలివి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అయ్యింది.

Published : 15 Nov 2022 18:30 IST

పెనుమూరు: ‘ఏమయ్యా రూ.5000 ఇస్తానని చెప్పి వెయ్యి రూపాయలు ఇస్తావా? ఇదేనా? అక్కడ ఇచ్చి పని చేసుకు పో..’’ చిత్తూరు జిల్లా పెనుమూరు మండల తహశీల్దార్‌ రమణి ఓ రైతుతో అన్న మాటలివి. వివరాల్లోకి వెళితే పెనుమూరు మండలంలోని కలవకుంట పంచాయతీ పూనేపల్లికి చెందిన రైతు సయ్యద్ తనకున్న వ్యవసాయ భూమిని వాణిజ్య భూమిగా మార్పు చేసుకునేందుకు తహశీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలో తహశీల్దార్‌ రమణిని రైతు సయ్యద్‌ సంప్రదించగా.. రూ.5వేలు ఇస్తేనే ధ్రువీకరణ పత్రం ఇస్తామని తహశీల్దార్‌ తేల్చి చెప్పారు. అందుకు సయ్యద్‌ కూడా అంగీకరించాడు.

అయితే, రైతు సయ్యద్‌కు అంత మొత్తం డబ్బులు సమకూరక పోవడంతో మరోసారి తహశీల్దార్‌ను కలిశాడు. రూ.5వేలు సమకూరలేదని వెయ్యి రూపాయలే సర్దుబాటయ్యాయని, రూ.వెయ్యి ఇస్తానని చెప్పాడు. అందుకు ఆమె అసహనంతో..‘ ఏందయ్యా మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి’ అని నిట్టూర్చారు. రూ.5వేలు ఇస్తానని వెయ్యి ఇస్తావా? పక్కన ఇచ్చి పని చేసుకో.. అని అసహనంతో ఆదేశించారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఉన్నతాధికారులు స్పందించారు. తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ ఆదేశించినట్టు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని