12 MRO కార్యాలయాల్లో అనిశా సోదాలు

AP News: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలోని 12 తహసీల్దార్‌ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (అనిశా) సోదాలు నిర్వహించింది. విశాఖలోని సీతమ్మధార...

Updated : 21 Jul 2021 19:26 IST

విశాఖ: ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరం జిల్లాల పరిధిలోని 12 తహసీల్దార్‌ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (అనిశా) సోదాలు నిర్వహించింది. విశాఖపట్నంలోని సీతమ్మధార, పెందుర్తి, ఆనందపురం, పద్మనాభం, విశాఖ గ్రామీణం, అచ్యుతాపురం తహసీల్దార్‌ కార్యాలయాల్లో అనిశా అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే విజయనగరం జిల్లాలోని ఆరు తహసీల్దార్ కార్యాలయాల్లోనూ సోదాలు  చేపట్టారు. రెండు జిల్లాల్లోనూ ఆరు బృందాలు చొప్పున ఏర్పడిన అనిశా అధికారులు సోదాలు చేశారు. ఒక్కో బృందంలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇతర సహాయ సిబ్బంది ఉన్నారు. మూడు బృందాలకు ఒక డీఎస్పీ పర్యవేక్షకుడుగా ఉన్నారు. విశాఖ జిల్లాలో సోదాలను అనిశా అదనపు ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.

విశాఖలోని ఆరు తహసీల్దార్ కార్యాలయాల్లో ఈ రోజంతా అనిశా అధికారుల సోదాలు కొనసాగాయి. సెలవు రోజున కూడా అధికారులు దస్త్రాలు పరిశీలించారు. 14,400 కాల్ సెంటర్ ఫిర్యాదులు, ఫోన్ల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు అధికారులు తెలిపారు. సరైన కారణం లేకుండా దరఖాస్తులు, పరిశీలన చేయకుండా, పరిష్కరించకుండా తిరస్కరిస్తున్నారన్న ఫిర్యాదులపైనా సమగ్ర పరిశీలన చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ అర్బన్ సీతమ్మధార ఎంఆర్‌వో కార్యాలయంలో దస్త్రాల నిర్వహణ సరిగ్గా లేకపోవడంతో పరిశీలనకు ఎక్కవ సమయం పడుతోందన్నారు. అక్కడ తనిఖీలు చేస్తున్న అనిశా బృందానికి పెద్ద సంఖ్యలో బాధితులు, ఫిర్యాదుదారులు వచ్చి తమ గోడు వినిపిస్తున్నారు. రేపు కూడా ఈ ప్రాంతాల్లో సోదాలు కొనసాగే అవకాశం కనిపిస్తోంది.

విజయనగరం జిల్లాలోని ఆరు తహసీల్దార్‌ కార్యాలయాల్లో మొదటి రోజు తనిఖీలు చేపట్టిన కార్యాలయాల్లో రెండో రోజూ తనిఖీలు కొనసాగించారు. విశాఖ సమీప మండలాలైన భోగాపురం, డెంకాడ, పూసపాటిరేగ, ఎస్.కోట, కొత్తవలస, జామి తహసీల్దార్ కార్యాలయాల్లో బుధవారం ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఇద్దరు డీఎస్పీ, 10మంది సీఐల ఆధ్వర్యంలో ఆయా కార్యాలయాలకు చేరుకొని దస్త్రాలను పరిశీలించారు. ప్రధానంగా భూ లావాదేవీలు, పట్టాదారు పాసు పుస్తకాలు, ఇంటి స్థలాలు, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, సిటిజన్ ఛార్ట్ అమలు తదితర అంశాలకు సంబంధించిన దస్త్రాలను పరిశీలించినట్లు తెలుస్తోంది. మీ సేవల ద్వారా ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తుల పెండింగ్‌పై అనిశా అధికారులు ఆరా తీశారు. ఇందులో భాగంగా పూసపాటిరేగ తహసీల్దార్ కార్యాలయంలో అన్ని అనుమతులు పూర్తయి.. రైతులకు పంపిణీ చేయని 471 పట్టాదారు పాసుపుస్తకాలు, 629 ఇళ్ల పట్టాలను అనిశా అధికారులు గుర్తించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని