Ratan Tata: బిజీబిజీగా ఉండే ముంబయిలో..ఇదొక అపురూప దృశ్యం!

వర్షాకాలం చిరుజల్లులు ఆహ్లాదంగానే ఉన్నా.. భారీ వర్షాలు మాత్రం ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని దాటుకొని మనం ఎలాగోలా ఇంటికెళ్లిపోతాం.

Published : 25 Sep 2021 01:23 IST

తమ ఉద్యోగి చూపిన చొరవకు టాటా మెచ్చుకోలు

ముంబయి: వర్షాకాలం చిరుజల్లులు ఆహ్లాదంగానే ఉన్నా.. భారీ వర్షాలు మాత్రం ఇబ్బంది పెడుతుంటాయి. వాటిని దాటుకొని మనం ఎలాగో ఇంటికెళ్లిపోతాం. కానీ, వీధుల్లో ఉండే మూగ జీవాలు మాత్రం వర్షంలో తడిసి ముద్దయిపోతాయి. ఖాళీ భవనాల్లోనో, వాహనాల కిందో.. వాటికి అనువైన దగ్గర చేరతాయి. కొన్నింటికి ఆ అవకాశం కూడా ఉండదు. వాటి గురించి ఆలోచిస్తే.. ఎంతోకొంత మనమూ చేయొచ్చని నిరూపించే చిత్రం ఒకదాన్ని ప్రముఖ వ్యాపారవేత్త రతన్‌టాటా ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. తాజ్‌ మహల్ ప్యాలెస్‌ హోటల్‌కు చెందిన ఉద్యోగి చూపిన చొరవను మెచ్చుకున్నారు. 

‘ఈ వర్షాకాలం మన సౌకర్యాల్లో కొంత..వీధి జంతువుల కోసం. భారీ వర్షం పడుతున్న సమయంలో ఈ తాజ్‌ ఉద్యోగి దయాగుణం చూపారు. తన గొడుకు కింద శునకానికి కొంత చోటిచ్చారు. నిత్యం బిజీగా ఉండే ముంబయి వీధుల్లో ఈ అపురూప దృశ్యం కెమెరా కంటికి చిక్కింది. ఈ మాత్రం చొరవ వీధి జీవాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది’ అంటూ రతన్‌ టాటా ఇన్‌స్టాగ్రాంలో రాసుకొచ్చారు. ఆ వెంటనే ఆ చిత్రం నెట్టింట్లో వైరల్‌గా మారింది. టాటాతో పాటు నెటిజన్లనూ మెప్పించింది. 

వ్యాపార దిగ్గజం రతన్ టాటాకు శునకాలంటే అమిత ప్రేమ. టాటా గ్రూప్ కేంద్ర కార్యాలయం బాంబే హౌస్‌లో శునకాల కోసం ప్రత్యేకంగా ఒక కెన్నెల్ ఉంది. ఆ ప్రాంతంలోని వీధి కుక్కల బాగోగుల కోసం దాన్ని ఏర్పాటు చేశారు. కాగా, తాజ్‌ మహల్ ప్యాలెస్ హోటల్‌..టాటా గ్రూప్‌లో భాగమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని