
Ts News: ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: డీహెచ్ శ్రీనివాసరావు
హైదరాబాద్: కొవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ సంచాలకులు (డీహెచ్) డా. శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై డీహెచ్ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. కొవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను కఠినంగా అమలు చేస్తున్నట్లు కోర్టుకు తెలిపారు. ఈ నెల 1నాటికి రాష్ట్రంలో 2.97 కోట్ల మంది కరోనా నుంచి కోలుకున్నట్లు డీహెచ్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు 6,82,215 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని డీహెచ్ తెలిపారు. రాష్ట్రంలో పాజిటివిటీ రేటు 2.29 శాతం, మరణాల రేటు 0.5 శాతంగా ఉన్నట్లు చెప్పారు. ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షల నిమిత్తం 34 ప్రభుత్వ, 76 ప్రైవేటు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అదే విధంగా ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షల నిర్వహణ కోసం 1,231 కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు నివేదికలో వెల్లడించారు. గత నెలలో నిత్యం సుమారు 35,126 కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సదుపాయం పెరిగిందని న్యాయస్థానానికి తెలిపారు. టీకా మొదటి డోసు 100 శాతం, రెండో డోసు 69 శాతం పూర్తైందని నివేదికలో వెల్లడించారు.