Child labour: చిన్నారులను తల్లిదండ్రులే పనికి పంపిస్తే.. తెలంగాణ సర్కార్‌ కీలక ఉత్తర్వులు

బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో బాలకార్మిక చట్టాన్ని సవరిస్తూ విధివిధానాలు ఖరారు

Published : 17 Dec 2021 01:49 IST

హైదరాబాద్‌: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర చట్టానికి అనుగుణంగా రాష్ట్రంలో బాలకార్మిక చట్టాన్ని సవరిస్తూ విధివిధానాలు ఖరారు చేస్తూ కార్మికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 14 ఏళ్ల లోపు చిన్నారులతో ఎవరైనా, ఎక్కడైనా పనిచేయించుకుంటే కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇందుకు ఆర్నెళ్ల నుంచి ఏడాది జైలుశిక్షతో పాటు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధిస్తారు. ఒకవేళ చిన్నారులను తల్లిదండ్రులే పనికి పంపిస్తే వారు కూడా శిక్షార్హులేనని స్పష్టం చేసింది. అయితే చిన్నారుల విద్యకు ఎలాంటి ఆటంకం కలగకుండా పనుల్లో చిన్నారులు వారి తల్లిదండ్రులకు సహాయపడవచ్చు. హానికరమైన పనులు, ఆదాయం వచ్చేలా తయారీ రంగం, ఉత్పత్తి, రిటైల్ చైన్ సరఫరా పనులకు వినియోగించరాదని స్పష్టం చేసింది.

ఉత్తర్వుల్లోని మరిన్ని విధివిధానాలు..

* పాఠశాల సమయాలతో పాటు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు చిన్నారులు పని చేయరాదు.

* బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన, పర్యవేక్షణ కోసం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీ ఏర్పాటు.

* ముందస్తు అనుమతి లేకుండా 30 రోజుల పాటు చిన్నారి పాఠశాలకు గైర్హాజరైతే ఆ విషయాన్ని పాఠశాల ప్రిన్సిపాల్ నోడల్ అధికారి దృష్టికి తీసుకెళ్లాలి.
 
కళాకారులుగా చిన్నారులు పనిచేసే అంశంలో పాటించాల్సిన నిబంధనలివే..

* సినిమాలు, ఇతర చిత్రీకరణలో చిన్నారులు నటించేందుకు కలెక్టర్ల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి.

* నిర్మాత లేదా దర్శకులు ఈ మేరకు అనుమతి తీసుకోవాలి.

* చిన్నారుల ఇష్టానికి వ్యతిరేకంగా ఎలాంటి చిత్రీకరణలోనూ పాల్గొనేలా చేయరాదు.

* రోజుకు ఐదు గంటలకు మించి, విరామం లేకుండా మూడు గంటలకు మించి చిన్నారులను చిత్రీకరణలో పనిచేయించకూడదు.

* చిత్రీకరణ సమయంలోనూ అన్ని రకాల జాగ్రత్తలు పూర్తి స్థాయిలో పాటించాల్సి ఉంటుంది.

* చిన్నారుల పరిరక్షణ, విద్యాహక్కు చట్టం, లైంగిక వేధింపుల చట్టం ఉల్లంఘనలు లేకుండా చూడాలి.

* చిన్నారుల విద్యకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడంతో పాటు 27 రోజులకు మించి ఏ చిన్నారిని చిత్రీకరణకు అనుమతించకూడదు.

* ఐదు మందికి మించి చిన్నారులు చిత్రీకరణలో ఉన్నట్లైతే వారి పర్యవేక్షణ కోసం ఒక వ్యక్తిని ప్రత్యేకంగా నియమించాలి.

* చిన్నారులకు వచ్చే ఆదాయంలో కనీసం 25శాతం మొత్తాన్ని బ్యాంకులో ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలి. సదరు చిన్నారి మేజర్ అయ్యాక ఆ మొత్తం చిన్నారికి చెందేలా చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని