Published : 03/12/2021 21:00 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. దూసుకొస్తున్న జవాద్‌

పశ్చిమమధ్య బంగాళాఖాతం నుంచి గంటకు 22 కిలోమీటర్ల వేగంతో జవాద్‌ తుపాను కోస్తాంధ్రతీరం వైపు దూసుకొస్తోంది. ప్రస్తుతం విశాఖకు 360 కిలోమీటర్ల  దూరంలో, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 470, పారాదీప్‌కు 530 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణశాఖ తెలిపింది. ఇది మరింత పశ్చిమ వాయువ్యదిశగా కదులుతూ రేపు ఉదయానికి కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే సూచనలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

2. రాజ్యసభ నుంచి తెరాస ఎంపీల వాకౌట్‌

తెలంగాణ నుంచి బాయిల్డ్‌ రైస్‌ కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెరాస ఎంపీలు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు. ధాన్యం కొనుగోలుపై రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందని తెరాస సభ్యులు సభనుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసే  తమ ఆందోళన కొనసాగుతుందని రాజ్యసభలో తెరాస పక్షనేత కె.కేశవరావు స్పష్టం చేశారు.

3. పథకాల పేర్లు ఇష్టమొచ్చినట్టు మార్చడం కుదరదు: స్మృతి ఇరానీ

కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను రాష్ట్రాలు తమకు నచ్చినట్టు మార్చడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్ర పథకాలకు ఏపీలో జగనన్న గోరుముద్ద, జగనన్న పాలు, వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పేర్లు పెట్టడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఐసీడీఎస్‌, ఐసీపీఎస్‌ పథకాలకు కేంద్రం కేటాయించిన రూ.187 కోట్లకు లెక్కలు చూపాలని రాష్ట్రాన్ని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లను మార్చడంపై  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఫిర్యాదు చేశారు. 

4. హెచ్‌ఎండీఏకు రూ.474 కోట్ల ఆదాయం

ఉప్పల్‌ భగాయత్‌లో మూడో దశలో ప్లాట్ల వేలం ద్వారా హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ)కు రూ.474 కోట్ల ఆదాయం లభించింది. మొదటి రోజు గరిష్టంగా చదరపు గజం లక్ష రూపాయలకు పైగా పలికింది. రెండో రోజైన ఇవాళ జరిగిన వేలంలో గరిష్టంగా గజం రూ.72వేలు పలికింది. మొత్తంగా 84,966 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 39 ప్లాట్ల విక్రయంతో హెచ్ఎండీఏకు రూ.474.61 కోట్ల  ఆదాయం సమకూరింది. సగటున గజం రూ. 55,859 రూపాయలు పలికింది. 

5. ‘ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేం’

పీఆర్‌సీ సహా సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో కార్యదర్శుల కమిటీ సమావేశం ముగిసింది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయం మొదటి బ్లాక్‌ లోని సీఎం సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరగా.. నివేదికలోని సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేమని స్పష్టం చేశారు.

6. దక్షిణాఫ్రికా పర్యటనపై డిసెంబరు 4న స్పష్టత!

టీమ్‌ఇండియా దక్షిణాఫ్రికా పర్యటనపై (డిసెంబరు 4న) శనివారం స్పష్టత రానుంది. కోల్‌కతాలో నిర్వహించనున్న బీసీసీఐ 90వ వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లో టీమ్‌ఇండియా పర్యటనపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో దక్షిణాఫ్రికా పర్యటనను రద్దు చేయాలా.? వాయిదా వేయాలా.? అనే విషయం తేలిపోనుంది. త్వరలో నిర్వహించనునున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)-2022 సీజన్‌కు సంబంధించిన మెగా వేలం తేదీని కూడా బీసీసీఐ వర్గాలు ప్రకటించే అవకాశం ఉంది. 

7. యూపీఐ, క్యూఆర్‌ కోడ్‌ చెల్లింపుల ఆల్‌టైమ్‌ రికార్డ్‌

భారత్‌లో డిజిటల్‌ చెల్లింపులు చేసే వారి సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడయింది. వీటిలో ఎక్కువగా క్యూఆర్‌ కోడ్, యూనిఫైడ్ పేమెంట్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ద్వారా జరిగే లావాదేవీలు ఎక్కువగా ఉన్నాయట. ఈ మేరకు వరల్డ్‌లైన్ ఇండియా అనే సంస్థ ఇండియా డిజిటల్ పేమెంట్స్‌ రిపోర్ట్ క్యూ3 2021 పేరుతో రూపొందించిన నివేదికలో ఈ విషయాలను వెల్లడించింది. 2021 క్యూ3 (జులై నుంచి సెప్టెంబరు)లో యూపీఐ ద్వారా జరిగే చెల్లింపుల్లో  103 శాతం పెరుగుదల చోటుచేసుకుందని నివేదికలో పేర్కొంది.

8. చిన్నారులకు కొవిడ్‌ టీకా.. త్వరలోనే 5 అందుబాటులోకి!

దేశవ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 50శాతం అర్హులకు పూర్తి మోతాదులో (రెండు డోసుల్లో) టీకా అందించినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే సమయంలో 18ఏళ్లలోపు చిన్నారులకు టీకా అందించేందుకూ ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. 2 ఏళ్లు పైబడిన పిల్లల కోసం త్వరలోనే ఐదు వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

9. కంగనకు చేదు అనుభవం.. కారును చుట్టిముట్టిన రైతులు

బాలీవుడ్‌ నటి కంగనకు పంజాబ్‌లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారును కొందరు రైతులు నిలువరించారు. పంజాబ్‌లోని చండీగఢ్‌ - ఉనా జాతీయ రహదారిపై కిరాత్‌పుర్‌ సాహిబ్‌ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పంజాబ్‌లో ప్రవేశించగా.. ఓ మూక తన కారుపై దాడి చేసిందని, తాము రైతులమని వారు చెబుతున్నారంటూ కంగన ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. 

10. సమాచారం లేదని పరిహారం ఇవ్వరా? ఇదిగో ఆ జాబితా!

సాగు చట్టాల వ్యతిరేక పోరాటంలో మృతిచెందిన రైతుల సమాచారం తమ వద్ద లేదంటూ ఇటీవల లోక్‌సభలో కేంద్రం ఇచ్చిన సమాధానంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. నెలల తరబడి కొనసాగిన ఈ పోరాటంలో దాదాపు 700 మందికిపైగా రైతులు చనిపోయారన్నారు. సమాచారం లేదని చెప్పి ఆ రైతుల కుటుంబాలకు  పరిహారం ఇవ్వడం మానేస్తారా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. పోరాటంలో అమరులైన అన్నదాతల జాబితా పంజాబ్‌ ప్రభుత్వం వద్ద ఉందని.. దాన్ని కేంద్రం తీసుకోవాలన్నారు. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

ఇవీ చదవండి


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని