Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Nov 2022 13:02 IST

1. మునుగోడు ఉప ఎన్నికలో నైతిక విజయం నాదే..: రాజగోపాల్‌ రెడ్డి

మునుగోడు ఉప ఎన్నికలో నైతిక విజయం తనదేనని భాజపా అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి అన్నారు. 84 మంది ఎమ్మెల్యేలను, 16 మంది మంత్రులను దింపినప్పుడే తన విజయం ఖాయమైందన్నారు. ఇది హోరాహోరీ పోరాటమని, ఫలితాలు తప్పకుండా తమకుకు అనుకూలంగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషన్ సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఫలితాల వెల్లడిలో సీఈవో తీరు అనుమానాస్పదం: బండి సంజయ్‌

తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారిన మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయితే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ వైఖరిని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తప్పుబట్టారు. ఫలితాల వెల్లడిలో సీఈవో తీరు అనుమానాస్పదంగా ఉందన్నారు. తెరాస ఆధిక్యంలోకి వస్తే తప్ప రౌండ్ల వారీగా ఫలితాలను అప్‌డేట్‌ చేయడం లేదని.. భాజపా లీడింగ్‌లోకి వచ్చినా వెల్లడించడం లేదని ఆయన ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ 200 ఖాళీ ఈవీఎంల సంగతేంటి?: కేఏ పాల్‌

మునుగోడు ఉస ఎన్నికలో అవినీతి జరిగిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. 200 ఖాళీ ఈవీఎంలను మిగతావాటితో కలిపి భద్రపరచడంపై అనుమానం వ్యక్తం చేశారు. ఎలక్షన్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Munugode: అందుకే ఫలితాలు ఆలస్యం: సీఈవో

మునుగోడు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్‌ తెలిపారు. ‘‘ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు లేవు. 47 మంది అభ్యర్థులు ఉన్నందున ఎక్కువ సమయం పడుతోంది. ప్రతి టేబుల్‌ వద్ద అబ్జర్వర్లు, ఏజెంట్లు ఉన్నారు. జాప్యం లేకుండా ఓట్ల లెక్కింపు పూర్తి చేస్తాం’’ అని సీఈవో చెప్పారు. కాగా మొత్తం ఐదు రౌండ్లు పూర్తయ్యేసరికి తెరాసకు 32,605, భాజపాకు 30,974, కాంగ్రెస్‌కు 7,380 ఓట్లు వచ్చాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. టీ20 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌ సంచలన విజయం

టీ20 ప్రపంచకప్‌లో పసికూన నెదర్లాండ్స్‌ సంచలన విజయం నమోదు చేసింది. లీగ్‌ దశలో దిగ్గజ టీమ్‌ దక్షిణాఫ్రికాపై 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. అడిలైడ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ అదరగొట్టి నెదర్లాండ్స్‌ ఆశ్చర్యపరిచింది. చిన్న జట్టులను తక్కువ అంచనా వేయకూడదని మరోసారి సంకేతాలు పంపింది. దక్షిణాఫ్రికా ఓటమితో ఆదివారం జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌తో సంబంధం లేకుండా టీమ్‌ ఇండియా నేరుగా సెమీస్‌కు వెళ్లిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. విమర్శలపై ‘ఆదిపురుష్‌’ టీమ్ ఫోకస్‌‌.. ఏకంగా రూ.100 కోట్లు ఖర్చు..?

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ ‘ఆదిపురుష్‌’. ఓంరౌత్‌ దర్శకుడు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్రబృందం మొదటి నుంచి భావించినప్పటికీ అనుకోని కారణాల వల్ల వాయిదాపడినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. దీని ప్రకారం ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదలయ్యే అవకాశం ఉందని అందరూ భావించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘జేబులు చిరిగిపోతున్నాయి’.. వైకాపా నేత ఆవేదన

జన సమీకరణ చేయాలంటే మా జేబులు చిరిగిపోతున్నాయి. ఒక వ్యక్తిని తీసుకురావాలంటే రూ.1000 వరకు ఖర్చవుతోంది. తట్టుకోలేకపోతున్నాం’ వైకాపా మండల స్థాయి నాయకుడి ఆవేదన ఇది. విజయనగరం జిల్లా లక్కవరపుకోటలో వైకాపా నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశం శనివారం ఏర్పాటు చేశారు. దీనికి జడ్పీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) హాజరయ్యారు. విశాఖలో ఈ నెల 12న ప్రధాని మోదీ, సీఎం జగన్‌ పర్యటన నేపథ్యంలో కార్యకర్తలు సూచనలు ఇవ్వాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Tirumala: వచ్చే నెల నుంచి వీఐపీ బ్రేక్‌ దర్శన వేళల మార్పు

తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబరు 1 నుంచి ఉదయం 8-12 గంటల మధ్య వీఐపీ బ్రేక్‌ దర్శనాలను కల్పిస్తామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. అందుకు అనుగుణంగా రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్‌లైన్‌ టికెట్ల స్లాట్‌లను ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తామని తెలిపారు. శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో డయల్‌ తితిదే ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉమ్మడి పౌర స్మృతి.. ఉచిత స్కూటీలు.. ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్‌!

హిమాచల్‌ ప్రదేశ్‌లో తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి పౌర స్మృతిని అమలు చేస్తామని భాజపా హామీ ఇచ్చింది. అలాగే దశలవారీగా ఎనిమిది లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆదివారం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. మహిళల కోసం ప్రత్యేక మేనిఫెస్టోను రూపొందించింది. పార్టీ జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డా ‘సంకల్ప్‌ పత్ర’ను ఆవిష్కరించారు. హామీలపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఓ కమిటీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Twitter Blue: అక్కడ ప్రారంభమైన ట్విటర్‌ బ్లూ.. భారత్‌లో ఎప్పుడంటే?

ట్విటర్‌లో పెయిడ్‌ వెర్షన్‌ అయిన ‘ట్విటర్‌ బ్లూ (Twitter Blue)’ సేవలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యూకేలో ప్రారంభమయ్యాయి. తొలుత కేవలం ఐఫోన్‌ వినియోగదారులకు మాత్రమే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘‘ఈరోజు నుంచి ట్విటర్‌ బ్లూ (Twitter Blue)కి గొప్ప ఫీచర్లను జత చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని రానున్నాయి. నెలకు 7.99 డాలర్లు చెల్లించి ట్విటర్‌ బ్లూకి సైనప్‌ కావొచ్చు’’ అనే నోటిఫికేషన్‌ అందినట్లు పలువురు ఐఫోన్‌ యూజర్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని