Twitter Blue: అక్కడ ప్రారంభమైన ట్విటర్‌ బ్లూ.. భారత్‌లో ఎప్పుడంటే?

Twitter Blue: ట్విటర్‌లో మార్పులకు శ్రీకారం చుట్టిన ఎలాన్ మస్క్‌ తాజాగా మరికొన్ని మార్పులను ప్రకటించారు. అలాగే భారత్‌లో ట్విటర్‌ బ్లూ సేవల్ని త్వరలోనే ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.

Published : 06 Nov 2022 12:00 IST

దిల్లీ: ట్విటర్‌లో పెయిడ్‌ వెర్షన్‌ అయిన ‘ట్విటర్‌ బ్లూ (Twitter Blue)’ సేవలు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యూకేలో ప్రారంభమయ్యాయి. తొలుత కేవలం ఐఫోన్‌ వినియోగదారులకు మాత్రమే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. ‘‘ఈరోజు నుంచి ట్విటర్‌ బ్లూ (Twitter Blue)కి గొప్ప ఫీచర్లను జత చేస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని రానున్నాయి. నెలకు 7.99 డాలర్లు చెల్లించి ట్విటర్‌ బ్లూకి సైనప్‌ కావొచ్చు’’ అనే నోటిఫికేషన్‌ అందినట్లు పలువురు ఐఫోన్‌ యూజర్లు తెలిపారు.

మరోవైపు భారత్‌లో దీన్ని ఎప్పుడు ప్రారంభించనున్నారని ఓ యూజర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk)ను అడిగారు. దానికి ఆయన సమాధానమిస్తూ.. ‘‘బహుశా ఒక నెలలోపు ప్రారంభమవ్వొచ్చు’’ అని తెలిపారు. ట్విటర్‌ బ్లూ (Twitter Blue) సబ్‌స్క్రిప్షన్‌ తీసుకున్నవారికి ప్రముఖుల తరహాలో బ్లూ చెక్‌మార్క్‌తో పాటు తక్కువ ప్రకటనలు, ఎక్కువ నిడివిగల ఆడియో, వీడియోలను పోస్ట్ చేసే అవకాశం వంటి అదనపు ఫీచర్లను అందించనుంది. ఇలా నెలవారీ సబ్‌స్క్రిప్షన్‌ ప్రారంభించనున్నట్లు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ప్రకటించినప్పటి నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ.. వెనక్కి తగ్గేది లేదని మస్క్‌ తెగేసి చెప్పారు.

ట్విటర్‌ (Twitter)లో తర్వాత చేయనున్న మార్పులనూ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) వెల్లడించారు. సుదీర్ఘ సందేశాలను సైతం పోస్ట్‌ చేసేలా మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పదాల విషయంలో పరిమితి ఉన్న విషయం తెలిసిందే. దీంతో చాలా మంది నోట్‌ప్యాడ్‌లో తమ సందేశాన్ని రాసి.. దాని స్క్రీన్‌షాట్‌ను ట్విటర్‌ (Twitter)లో పోస్ట్‌ చేస్తున్నారు. అలాంటి ఇబ్బందులను తొలగించడానికే పెద్ద పెద్ద మెస్సేజ్‌లను సైతం పోస్ట్‌ చేసేలా మార్పులు చేయనున్నట్లు మస్క్‌ తాజాగా ప్రకటించారు.

మరోవైపు ట్విటర్‌ కంటెంట్‌ క్రియేటర్లకు నగదు అందించే విషయంపైనా మస్క్‌ స్పందించారు. ‘‘యూట్యూబ్‌ తమ ప్రకటనల ఆదాయంలో 55 శాతం కంటెట్‌ క్రియేటర్లకు ఇస్తోంది’’ అని ఓ యూజర్‌ పోస్ట్‌ చేశారు. దానికి మస్క్‌ స్పందిస్తూ.. ‘‘మనం దాన్ని అధిగమించొచ్చు’’ అని అన్నారు. 44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ను సొంతం చేసుకున్న మస్క్‌ అనేక మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా సగం మంది ఉద్యోగులను తొలగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని