Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 22 Jan 2022 17:01 IST

1.రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు అమలుకు సర్కార్ సన్నద్ధం.. కలెక్టర్లకు ఆదేశాలు

రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు పథకం అమలుకు సర్కార్ సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దత్తత గ్రామం వాసాలమర్రి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పైలట్ పద్ధతిలో పూర్తి స్థాయిలో పథకం అమలవుతోంది. మరో నాలుగు మండలాల్లోనూ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లా చింతకాని, సూర్యాపేట జిల్లా తిరుమలగిరి, నాగర్ కర్నూల్ జిల్లా చారగొండ, కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలాలు ఇందులో ఉన్నాయి.

2.జూద రాజధానిగా గుడివాడను అభివృద్ధి చేస్తున్నారా?: ధూళిపాళ్ల

బహిరంగంగా క్యాసినోలు నిర్వహిస్తే సీఎం జగన్‌ మౌనం దేనికి సంకేతమని తెదేపా సీనియర్‌ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. సీఎం, డీజీపీ మౌనం చూస్తుంటే అనుమానం కలుగుతోందన్నారు. ఇంత వరకు మంత్రిని ఎందుకు బర్తరఫ్‌ చేయలేదని నిలదీశారు. గుడివాడలో మంత్రి కొడాలి నాని కన్వెన్షన్‌ సెంటర్లో క్యాసినో నిర్వహించారనే ఆరోపణల నేపథ్యంలో ధూళిపాళ్ల మంగళగిరిలోని పార్టీ  కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.

3.మల్టీస్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం.. ఏపీకి నాబార్డు రుణం

ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్‌ఆర్‌ కడప, విజయనగరం, తూర్పు గోదావరి జిల్లాల్లో 3 బోధనాస్పతుల నిర్మాణానికి నాబార్డు రుణం మంజూరు చేసినట్టు ఆ సంస్థ సీజీఎం జన్నావర్ వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లోని ఐటీడీఏ ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం కోసం మొత్తంగా రూ. 1,392 కోట్లు రుణం మంజూరు చేసినట్టు తెలిపారు.

4.ఆ 5 రాష్ట్రాల్లో ర్యాలీలపై నిషేధం కొనసాగించాలా? వద్దా?

దేశ వ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతిని కట్టడి చేసే లక్ష్యంతో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో బహిరంగ సభలు, ర్యాలీలపై ఈసీ విధించిన నిషేధం నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో భౌతిక ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధాన్ని మళ్లీ పొడిగించాలా? లేదా అనే అంశంపై చర్చించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వర్చువల్‌ సమావేశాలు నిర్వహించి సమాలోచనలు చేస్తున్నారు. మరోవైపు, ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, పంజాబ్‌, మణిపూర్‌ అసెంబ్లీ ఎన్నికలకు జనవరి 8న షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

5.ప్రగతి పథంలో ఆశావహ జిల్లాలు.. దేశ పురోగతిలో కీలక పాత్ర: ప్రధాని

‘ఆశావహ జిల్లాల అభివృద్ధి పథకం’ కింద ఎంపికైన జిల్లాలు ఇప్పుడు దేశ పురోగతికి ఉన్న అడ్డంకుల్ని తొలగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పైగా దేశ వృద్ధిని ఇవి మరింత వేగవంతం చేస్తున్నాయని తెలిపారు. పథకాన్ని సమీక్షించడంలో భాగంగా శనివారం ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రధాని వర్చువల్‌గా సమావేశమయ్యారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

6.అధికారం కోసం ట్రంప్‌ అంతకు తెగించారా?

అధికారాన్ని అట్టిపెట్టుకోవడం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఏడాది క్రితం ఎంత హంగామా సృష్టించారో గుర్తుంది కదా! తాజాగా అధ్యక్ష పదవిలో కొనసాగడం కోసం ఆయన ఎంత దూరం వెళ్లారో నిరూపించే ఆసక్తికర ఆధారం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఓటింగ్‌ యంత్రాలను స్వాధీనం చేసుకోమని ఆదేశిస్తూ రక్షణశాఖ సెక్రటరీకి ఓ లేఖ రాయడానికి ఆయన సిద్ధమయ్యారట. దానికి సంబంధించిన ముసాయిదాను కూడా సిద్ధం చేసుకున్నారు.

7.ఈ కారు కావాలంటే.. బుక్‌ చేసి 4 ఏళ్లు ఆగాల్సిందే!

భారత్‌లో లైసెన్స్‌రాజ్‌ అమల్లో ఉన్న రోజుల్లో స్కూటర్‌ను బుక్‌ చేసిన తర్వాత అది రావడానికి దాదాపు 10 ఏళ్ల వరకు వేచి చూడాల్సి వచ్చేదని పెద్దలు చెబుతుండేవారు. కానీ, ఇప్పుడు రోజులు మారిపోయాయి. కొనాలన్న ఆలోచన వచ్చిన గంటల్లో బండి ఇంట్లో వచ్చి వాలిపోతోంది. అయితే, టయోటా నుంచి వస్తున్న ఓ ప్రీమియం కారు కోసం మాత్రం మళ్లీ లైసెన్స్‌రాజ్‌ నాటి రోజుల తరహాలో ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగని మరీ పదేళ్లు కాదు గానీ ఓ నాలుగేళ్ల నిరీక్షణైతే తప్పడం లేదు.

8.ఐపీఎల్‌ మెగా వేలంలోకి 1,214మంది.. విదేశీయుల్లో వారే టాప్‌

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్)లో అవకాశం కోసం పెద్ద పెద్ద స్టార్లతో పాటు యువ క్రికెటర్లు ఉత్సాహంగా ఎదురు చూస్తుంటారు. ఇలాంటి వారి కోసమే ఐపీఎల్‌ మెగా వేలం వచ్చే నెలలో జరగనుంది. ఎనిమిది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటెయిన్‌ చేసుకోవడం, కొత్త జట్లు ముగ్గురేసి ప్లేయర్లను ఎంపిక చేసుకోవడం ఇప్పటికే పూర్తైంది. మిగతా క్రికెటర్లంతా మెగా వేలంలో తమ పేర్లను రిజిస్టర్‌ చేసుకునే గడువు (జనవరి 20) కూడా ముగిసింది.

9.దక్షిణాఫ్రికా స్పిన్నర్లే నిలకడగా బౌలింగ్‌ చేశారు: పంత్

టీమ్‌ఇండియా స్పిన్నర్ల కంటే దక్షిణాఫ్రికా స్పిన్నర్లే స్థిరంగా బంతులు విసిరారని రిషభ్ పంత్‌ అన్నాడు. శుక్రవారం జరిగిన రెండో వన్డేలో అర్ధశతకం (85) చేసినా భారత్‌కు ఓటమి తప్పలేదు. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 287/6 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 48.1 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్‌ అనంతరం పంత్ మాట్లాడుతూ.. సఫారీల బౌలర్లు షంసి, కేశవ్ మహరాజ్‌, మార్‌క్రమ్‌ చాలా చక్కగా బౌలింగ్‌ చేశారని అభినందించాడు.

10.దేవెగౌడకు రెండోసారి కరోనా.. ఆ జైలులో 262మంది ఖైదీలకు పాజిటివ్‌!

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఒమిక్రాన్‌ ప్రభావంతో గత కొన్ని వారాలుగా భారీ సంఖ్యలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. నిన్నటితో పోలిస్తే ఉద్ధృతి కాస్త తగ్గినప్పటికీ శుక్రవారం కూడా 3లక్షలకు పైనే కొత్త కేసులు వచ్చాయి. ఈ మహమ్మారిని కట్టడి చేసేందుకు పలు రాష్ట్రాలు కొవిడ్‌ ఆంక్షలు అమలు చేస్తున్నా.. భారీ సంఖ్యలో జనం ఇన్ఫెక్షన్‌కు గురవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని