
ప్రగతి పథంలో ఆశావహ జిల్లాలు.. దేశ పురోగతిలో కీలక పాత్ర: ప్రధాని
దిల్లీ: ‘ఆశావహ జిల్లాల అభివృద్ధి పథకం’ కింద ఎంపికైన జిల్లాలు ఇప్పుడు దేశ పురోగతికి ఉన్న అడ్డంకుల్ని తొలగిస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పైగా దేశ వృద్ధిని ఇవి మరింత వేగవంతం చేస్తున్నాయని తెలిపారు. పథకాన్ని సమీక్షించడంలో భాగంగా శనివారం ఆయా జిల్లాల కలెక్టర్లతో ప్రధాని వర్చువల్‌గా సమావేశమయ్యారు. కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కేంద్రం, రాష్ట్రాలు, స్థానిక పాలనా యంత్రాంగాలు కలిసి చేస్తున్న కృషి సత్ఫలితాలిస్తోందని ప్రధాని అన్నారు. ఈ ఆశావహ జిల్లాలు మరింత పురోభివృద్ధి సాధించాలంటే.. ప్రజలు, పాలనాయంత్రాంగం మధ్య ప్రత్యక్ష సంబంధాలు మరింత మెరుగవ్వాలని మోదీ హితవు పలికారు. సాంకేతికత, నవకల్పనల ద్వారా పాలనను ప్రజలకు మరింత చేరువ చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో ఉన్న ఇబ్బందులను పరిష్కరించడం ద్వారా ఎలాంటి ప్రగతి సాధించవచ్చో ఆశావహ జిల్లాలు నిరూపించాయని తెలిపారు.
దేశవ్యాప్తంగా వెనుకబడిన 112 జిల్లాల అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2018లో కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఆశావహ జిల్లాల అభివృద్ధి పథకం (ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ స్కీమ్) అని దీనికి నామకరణం చేసింది. తెలంగాణ నుంచి భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఖమ్మం తదితర వెనుకబడిన జిల్లాలు ఈ పథకంలో ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయనగరం, విశాఖపట్నం, కడప తదితర జిల్లాలు ఉన్నాయి.