Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 09 Jun 2022 12:55 IST

1. రాష్ట్రపతి ఎన్నికకు నేడే షెడ్యూల్‌..!

దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు నేడు షెడ్యూల్‌ ఖరారు కానుంది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల తేదీని ప్రకటించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ పదవీకాలం జులై 24తో ముగియనుంది. ఆలోపు తదుపరి రాష్ట్రపతిని ఎన్నుకోవాల్సి ఉంటుంది.

సత్యదేవ్‌ ‘గాడ్సే’  చిత్ర ట్రైలర్‌ విడుదల

2. వివేకా హత్య కేసులో సాక్షి అనుమానాస్పద మృతి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకా హత్య కేసులో సాక్షిగా ఉన్న కల్లూరి గంగాధర్‌రెడ్డి (49) అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. అనంతపురం జిల్లా యాడికిలోని ఇంట్లో బుధవారం రాత్రి ఆయన చనిపోయారు. నిద్రపోయిన సమయంలో గంగాధర్‌రెడ్డి మృతి చెందినట్లు గుర్తించిన కుటుంబసభ్యులు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. 

3. గవర్నర్‌ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారు: నారాయణ

తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తలపెట్టిన మహిళా దర్బార్‌ కార్యక్రమంపై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ తమిళిసై లక్ష్మణరేఖ దాటుతున్నారని వ్యాఖ్యానించారు. మహిళా దర్బార్‌ అసలెందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఓవైపు భాజపా రాజకీయ దాడిని పెంచిందని, మరోవైపు గవర్నర్‌ పాత్ర అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లుగా ఉందన్నారు.

4. కుమారుడి మృతదేహాం కోసం తల్లిదండ్రుల భిక్షాటన

కన్నబిడ్డను కోల్పోయి కుమిలిపోతున్న తల్లిదండ్రుల పట్ల కనికరం చూపించాల్సింది పోయి.. అమానుషంగా ప్రవర్తించారో ఆసుపత్రి సిబ్బంది. రూ.50వేలు ఇస్తేనేగానీ వారి కుమారుడి మృతదేహాన్ని అప్పగించబోమన్నారు. అంత మొత్తం లేని ఆ నిరుపేద తండ్రి డబ్బు కోసం వీధివీధి తిరుగుతూ బిచ్చమెత్తుకున్నారు. ఈ అమానవీయ ఘటన బిహార్‌లోని సమస్తిపూర్‌లో చోటుచేసుకుంది.

5. భారీగా పెరిగిన కొవిడ్‌ కేసులు.. మళ్లీ 7వేల పైకి!

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కొన్నాళ్ల నుంచి నిత్యం నాలుగు వేల కొత్త కేసులు మాత్రమే వచ్చాయి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోంది. వరుసగా రెండోరోజు 40 శాతం మేర పెరిగాయి. ముందురోజు ఐదువేలకుపైగా వచ్చిన కేసులు.. నేడు 7 వేల మార్కు దాటేశాయి. క్రియాశీల కేసులు 28 వేల నుంచి ఒకేసారి 32 వేలకు ఎగబాకాయి.

నాని సతీమణి డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

6. కస్టడీకి ఏ-1 సాదుద్దీన్‌.. సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు!

జూబ్లీహిల్స్‌లో బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. కేసులో ఏ-1గా ఉన్న సాదుద్దీన్‌ మాలిక్‌ను చంచల్‌గూడ జైలు నుంచి పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నేటి నుంచి ఈ నెల 12వ తేదీ వరకు కస్టడీకి కోర్టు అనుమతించిన సంగతి తెలిసిందే. సాదుద్దీన్‌ను ప్రశ్నిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయని భావిస్తున్న పోలీసులు.. అత్యాచార ఘటనను సీన్ రీ-కన్‌స్ట్రక్షన్​ చేయనున్నారు.

7. కోహ్లీ రికార్డును బద్దలుకొట్టిన బాబర్‌ అజామ్

పాకిస్థాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ వన్డే క్రికెట్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కెప్టెన్‌గా అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్‌ కోహ్లీ 17 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించగా.. అజామ్‌ ఇప్పుడు దాన్ని 13 ఇన్నింగ్సుల్లోనే పూర్తి చేశాడు. బుధవారం వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో అతడు 103 పరుగులు సాధించి ఈ కొత్త రికార్డు సృష్టించాడు.

8. భారీ నష్టాల్లో మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఉదయం భారీ నష్టాల మధ్య ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9.22 సమయంలో నిఫ్టీ 69 పాయింట్లు పతనమై 16,286 వద్ద, సెన్సెక్స్‌ 282 పాయింట్లు పతనమైన 54,610 వద్ద కొనసాగుతున్నాయి. ఒక్క ఎనర్జీ రంగ సూచీ మినహా మిగిలిన రంగాల సూచీలు మొత్తం నష్టాల్లోనే ఉన్నాయి.

9. ముహూర్తానికి ముందే క్షమా బిందు ‘స్వీయ వివాహం’

ఆత్మీయుల సమక్షంలో.. బాజాభజంత్రీలు నడుమ వేద మంత్రాల సాక్షిగా క్షమా బిందు ‘స్వీయ వివాహం’ చేసుకొంది. సంప్రదాయ బద్ధంగా జరిగిన ఈ పెళ్లి వేడుకలో అన్నీ ఉన్నాయి గానీ.. ఒక్క వరుడే లేడు. ముందుగానే అన్నట్లుగా తనను తానే పెళ్లి చేసుకున్న క్షమా.. ఒంటరి వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. గుజరాత్‌ చెందిన 24ఏళ్ల క్షమా తనను తానే పెళ్లాడతానని ప్రకటించి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. 
10. 
జైన్‌కు లభించని ఊరట.. ఈడీ కస్టడీ గడువు పొడిగింపు

మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన దిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్‌కు ఊరట లభించలేదు. జైన్ ఈడీ కస్టడీలో ఉండే గడువును గురువారం కోర్టు పొడిగించింది. దాంతో జూన్‌ 13 వరకు ఆయన దర్యాప్తు సంస్థ కస్టడీలోనే ఉండాల్సి ఉంది. కోల్‌కతాకు చెందిన ఓ కంపెనీకి సంబంధించి మనీలాండరింగ్‌ లావాదేవీల కేసులో మే 30వ తేదీన సత్యేంద్ర జైన్‌ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని