Viveka Murder Case: వివేకా హత్య కేసు.. వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి చుక్కెదురు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.

Updated : 04 Sep 2023 19:02 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుడు, కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. మరో నిందితుడు గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆయన దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్లను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌ కుమార్‌రెడ్డిలపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నట్లు ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.

‘‘ ఏపీ సీఎంకు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి సన్నిహిత బంధువు. అలాగే ఈ కేసులో ఏ-8 ఎంపీ అవినాష్ రెడ్డికి ఆయన తండ్రి కూడా. అవినాష్‌, భాస్కర్‌, శివశంకర్‌కు ఉదయ్‌ అనుచరుడు. భాస్కర్‌, ఉదయ్‌ నేరాలపై నమ్మదగిన ఆధారాలున్నాయి. కుట్ర, సాక్ష్యాల చెరిపివేతలో వారిద్దరి ప్రమేయంపై ఆధారాలున్నట్లు కనిపిస్తోంది. వీళ్లిద్దరూ అత్యంత ప్రభావశీల వ్యక్తులు. సాక్షులంతా ఏపీ వారే. అందువల్ల వారిని బెదిరించి ప్రభావితం చేసే అవకాశాలున్నాయి. సీఐ శంకరయ్య, గంగిరెడ్డి వాంగ్మూలమిస్తామని వెనక్కి తగ్గారు. ఇద్దరు సాక్షులు అనుమానాస్పద స్థితిలో మరణించారు. సాక్షులను ప్రభావితం చేస్తే బెయిల్‌ రద్దు కోరవచ్చనడం సరికాదు. దస్తగిరి, సాక్షుల వాంగ్మూలాల విశ్వసనీయతను ట్రయల్‌ కోర్టే పరిశీలిస్తుంది. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సాక్షుల వాంగ్మూలాలను పరిగణనలోకి తీసుకోలేం. అవినాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్‌ సుప్రీం కోర్టు పరిశీలనలో ఉంది. దస్తగిరి మినహా నిందితులందరూ జ్యుడీషియల్‌ కస్టడీలోనే ఉన్నారు. కేసు డైరీ, అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం పిటిషన్లను కొట్టివేస్తున్నాం ’’ అని హైకోర్టు పేర్కొంది.

సీబీఐ కోర్టు బెయిలును తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. గత నెల 24న ఉన్నత న్యాయస్థానం వాదనలు ముగించి తీర్పును రిజర్వు చేసింది. తాజాగా వారిద్దరికీ బెయిల్‌ నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో భాస్కర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి ఉన్నారు.

శివశంకర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ

వివేకా హత్య కేసు నిందితుడు డి.శివశంకర్ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్‌పై గత నెల 24న వాదనలు ముగిశాయి. ఆయన బెయిల్ పిటిషన్‌పై గత 28న ఉత్తర్వులు ఇస్తామని సీబీఐ కోర్టు తెలిపింది. బెయిల్‌పై మరిన్ని వాదనలు వినాలని కోరుతూ ఆగస్టు 28న శివశంకర్ రెడ్డి మరో పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్‌పై మళ్లీ విచారణ జరపాలన్న పిటిషన్‌పై ఈరోజు వాదనలు పూర్తయ్యాయి. బెయిల్‌పై మరిన్ని వాదనలు వినాలన్న శివశంకర్ రెడ్డి పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని