మేకల దొంగలు @కామెడీ సినిమా

సినిమా తీయాలంటే కథ ఉండాలి. దాన్ని తెరపై చూపించడానికి దర్శకుడు కావాలి. కథలోని పాత్రలు పోషించడానికి నటులు కావాలి. వీళ్లతో పాటు ఇంకా చాలా మంది టెక్నీషియన్లు అవసరం అవుతారు. అన్నిటి కంటే ముఖ్యంగా వీళ్లందరికీ డబ్బు ఇచ్చి

Published : 12 Nov 2020 01:27 IST

తమిళనాడులో అన్నాదమ్ముల నిర్వాకం

 

చెన్నై : సినిమా తీయాలంటే కథ ఉండాలి. దాన్ని తెరపై చూపించడానికి దర్శకుడు కావాలి. కథలోని పాత్రలు పోషించడానికి నటులు కావాలి. వీళ్లతో పాటు ఇంకా చాలా మంది టెక్నీషియన్లు అవసరం అవుతారు. అన్నిటి కంటే ముఖ్యంగా వీళ్లందరికీ డబ్బు ఇచ్చి సినిమాను నిర్మించడానికి ఓ నిర్మాత కావాలి. అతను డబ్బు కోసం తనకున్నదాంతోనో.. అప్పు చేయడమో.. లోన్‌ తీసుకోవడమో మరేతర మార్గాలు ఎంచుకునో నిర్మాణం చేపట్టాలి. కానీ తమిళనాడు చెందిన ఓ వ్యక్తి కామెడీ సినిమా నిర్మించడం ప్రారంభించాడు. డబ్బు లేని కారణంతో సినిమా చిత్రీకరణ మధ్యలోనే నిలిచిపోయింది. దీంతో ఆ సినిమాలో ప్రధాన పాత్రధారులుగా ఉన్న ఆ వ్యక్తి కొడుకులిద్దరూ వినూత్నంగా ఆలోచించి మేకలను దొంగతనం చేస్తూ వచ్చిన సొమ్మును సినిమా నిర్మాణానికి ఉపయోగించి చివరకు పోలీసులకు చిక్కారు.   

వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడుకు చెందిన అన్నాదమ్ములు నిరంజన్‌కుమార్‌, లెనిన్‌ కుమార్‌ల తండ్రి విజయ్‌శంకర్‌ ఓ వినోదాత్మక సినిమా తీసే క్రమంలో ఆర్థిక అవసరం ఏర్పడింది. అందులో వీళ్లిద్దరూ నటిస్తుండటం.. నిర్మాణానికి డబ్బు అవసరం అవడంతో మేకలను దొంగిలించి వచ్చిన సోమ్మును చిత్రం అవసరాలకు వినియోగించాలని పథకం వేశారు. ఈ క్రమంలో ఆ రాష్ర్టంలోని చెంగల్పట్‌, మాధవరం, మింజూర్‌, పొన్నేరి గ్రామీణ ప్రాంతాలను దోపిడీకి లక్ష్యంగా ఎంచుకున్నారు. దొంగతనానికి కారులో వెళ్లే ఈ అన్నాదమ్ములు మేతకు వెళ్లే మేకల గుంపుల్లో రోడ్డు పక్కన ఉండే మేకలను ఒకచోట ఒకటి లేదా రెండు దొంగిలించి కారులో వేసుకొని వెళ్లేవారు. ఇలా ఒక రోజుకు ఎనిమిది నుంచి పది మేకలు దొంగిలించేవారు. ఒక్కో దాన్ని రూ. 8 వేలకు విక్రయించి సినిమా నిర్మాణానికి ఉపయోగించేవారు. ఇలా ఒక మందలో ఒకటి, రెండు మేకలు అదృశ్యమవటంతో వాటి యజమానులు కూడా పోలీసులకు ఫిర్యాదులు చేసేవారు కాదు. ఒక వేళ ఫిర్యాదు చేసినా ఇటువంటి కేసులపై పోలీసులు పెద్దగా దృష్టిసారించరని వీళ్లు ధీమాగా ఉండేవారు.

ఇలా వీళ్ల దొంగతనం.. దాంతో వచ్చే డబ్బులతో సినిమా చిత్రీకరణ కొన్నాళ్లు బాగానే సాగింది. అయితే గత నెల 9వ తేదీ వీరు మాధవరం అనే గ్రామంలో ఒక మేకను దొంగిలించారు. ఇదే వీళ్లను పోలీసులకు పట్టించేలా చేసింది. ఆ మందలో ఆరు మేకలే ఉండటం.. అందులో ఒకటి అదృశ్యమవడంతో వెంటనే గుర్తించిన వాటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీల ఫుటేజీల ఆధారంగా కారులో వచ్చిన వ్యక్తులు దొంగతనం చేస్తున్నట్లు తేల్చారు. దర్యాప్తులో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మేకలు పోయినట్లు పోలీసులు గుర్తించి నిఘా ఉంచారు. ఈ క్రమంలో గత శనివారం అన్నాదమ్ములిద్దరూ మళ్లీ దొంగతనానికి వచ్చి పోలీసులకు చిక్కారు. విచారణలో సినిమా దొంగతనం విషయం తెలిసి ఆశ్చర్యపోయారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.     

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని