Vande bharat express: కాచిగూడ- యశ్వంత్‌పూర్‌, చెన్నై- విజయవాడ టికెట్‌ ధరలివే..!

Vande bharat express: కాచిగూడ- యశ్వంత్‌పూర్‌, విజయవాడ- చెన్నై వందేభారత్ రైళ్లు సెప్టెంబర్‌ 24న ప్రారంభం కానున్నాయి. వీటి టికెట్‌ ధరలు ఖరారయ్యాయి.

Updated : 23 Sep 2023 15:03 IST

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో రెండు వందే భారత్‌ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. దేశవ్యాప్తంగా 9 వందే భారత్ రైళ్లను ఒకేసారి ఈ నెల 24న ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఇందులో కాచిగూడ- యశ్వంత్‌పూర్‌ (KACHEGUDA- YESVANTPUR JN), చెన్నై - విజయవాడ (CHENNAI- VIJAYAWADA) మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు కూడా ఉన్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రూట్లలో మెరుగైన సదుపాయాలతో వస్తున్న ఈ రైళ్లు ప్రయాణికుల అవసరాలను తీర్చనున్నాయి. తాజాగా వీటి టికెట్‌ ధరలు వెల్లడయ్యాయి.

కాచిగూడ To యశ్వంత్‌పూర్‌ ₹1600

కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌ (20703) మధ్య బుధవారం మినహా మిగిలిన ఆరు రోజులు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు అందుబాటులో ఉంటుంది. ఆయా రోజుల్లో ఉదయం 05:30 గంటలకు రైలు కాచిగూడ నుంచి ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌ (బెంగళూరు) జంక్షన్‌ చేరుకుంటుంది. 610 కిలోమీటర్ల దూరానికి 8.30 గంటల ప్రయాణం ఉంటుంది. మధ్యలో మహబూబ్‌నగర్‌ (6.49), కర్నూలు సిటీ (8.24), అనంతపురం (10.44), ధర్మవరం జంక్షన్‌ (11.14) స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్‌కు ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1600గా రైల్వే శాఖ నిర్ణయించింది. ఎగ్జిక్యూటివ్‌ ఛైర్‌కార్‌ ధర రూ.2915గా నిర్ణయించారు. ఇందులో కేటరింగ్‌ ఛార్జీలు అంతర్భాగంగా ఉంటాయి.

  • తిరుగు ప్రయాణంలో ఈ రైలు (20704) మధ్యాహ్నం 2.45 గంటలకు యశ్వంతపూర్‌లో బయల్దేరుతుంది. రాత్రి 11.15 గంటలకు కాచిగూడ స్టేషన్‌కు చేరుకుంటుంది. ధర్మవరం జంక్షన్‌ (4.59), అనంతపురం (5.29), కర్నూలు సిటీ (7.50) మహబూబ్‌నగర్‌ (9.34) స్టేషన్లలో నిమిషం చొప్పున ఆగుతుంది. తిరుగు ప్రయాణంలో మాత్రం ఛైర్‌కార్‌ టికెట్‌ ధర రూ.1540 గానూ, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ.2865గానూ రైల్వే శాఖ నిర్ణయించింది. కేటరింగ్‌ ఛార్జీల్లో వ్యత్యాసమే ఇందుక్కారణం.

ఒక్క రోజులోనే ఆంధ్రా ఊటీ అందాలు చూసొస్తారా?.. IRCTC టూర్‌ ప్యాకేజీ వివరాలు ఇవే..!

ఆరున్నర గంటల్లో విజయవాడ- చెన్నై

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత రద్దీ రూట్లలో ఒకటైన చెన్నై- విజయవాడ (20677) మధ్య ఇంకో వందేభారత్‌ రైలు అందుబాటులోకి వస్తోంది. ఈ రైలు 517 కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6.40 గంటల్లో చేరుకుంటుంది. మంగళవారం మినహా మిగిలిన ఆరు రోజులు ఈ రైలు అందుబాటులో ఉంటుంది. ఉదయం చెన్నైలో ఉదయం 5.30 గంటలకు బయల్దేరే ఈ రైలు మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మార్గమధ్యంలో రేణిగుంట (7.05), నెల్లూరు (8.39), ఒంగోలు (10.09), తెనాలి (11.21) స్టేషన్లలో ఆగుతుంది. ఛైర్‌కార్‌లో రూ.1320, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధరను రూ.2540గా రైల్వే శాఖ నిర్ణయించింది.

  • తిరుగు ప్రయాణంలో ఈ రైలు (20678) మధ్యాహ్నం 3.20 గంటలకు విజయవాడ నుంచి చెన్నై బయల్దేరుతుంది. రాత్రి 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఛైర్‌ టికెట్‌ ధర రూ.1420, ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ ధర రూ.2630గా నిర్ణయించారు. ఇరువైపులా నిర్దేశిత స్టేషన్లలో ఒక్కో నిమిషం మాత్రమే రైలు ఆగుతుంది. ఒక్క రేణిగుంటలో మాత్రమే 5 నిమిషాల స్టాపును నిర్దేశించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని