IRCTC tour package: ఒక్క రోజులోనే ఆంధ్రా ఊటీ అందాలు చూసొస్తారా?.. IRCTC టూర్‌ ప్యాకేజీ వివరాలు ఇవే..!

IRCTC tour package: ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకు లోయ అందాలు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే.  

Published : 23 Sep 2023 10:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆంధ్రా ఊటీగా ప్రసిద్ధిగాంచిన అరకు లోయ అందాలు వీక్షిస్తూ మైమరచి పోవాలని ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి?అరకు అందాలే కాదు.. విశాఖ నుంచి అక్కడి వరకు చేసే రైలు ప్రయాణమూ సరికొత్త అనుభూతిని పంచుతుంది. సొరంగాలు, వంతెనలు, ప్రకృతి దృశ్యాలను చూస్తూ సాగే ఆ ప్రయాణం జీవితాంతం గుర్తుంటుంది. అందుకే కేవలం ఒక్కరోజులోనే అరకు చూసిరావటానికి ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ప్యాకేజీని అందిస్తోంది. విశాఖపట్నం నుంచి అరకు వెళ్లే రైలు ప్రతిరోజూ అందుబాటులో ఉంటుంది. మీ ప్రయాణానికి అనువుగా టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. వీకెండ్‌లో ఏదైనా కొత్త ప్రదేశాన్ని చూసి రావాలంటే ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయొచ్చు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ముందు రోజే విశాఖ చేరుకోవాల్సిఉంటుంది.

రైలు ప్రయాణం ఇలా..

విశాఖపట్నంలో ఉదయం 6:45 గంటలకు రైలు (ట్రైన్‌ నం: 08551) బయల్దేరుతుంది. సొరంగాలు, వంతెనలు, ప్రకృతి దృశ్యాలను తిలకిస్తూ మీ ప్రయాణం కొనసాగుతుంది. ఉదయం 10.55 గంటలకు అరకు చేరుకుంటారు. అరకు రైల్వే స్టేషన్‌ నుంచి బయల్దేరి ముందుగా అరకు లోయకు వెళ్తారు. ఆ అందాల్ని వీక్షిస్తారు. తర్వాత ఆదివాసీ మ్యూజియం, చాపరాయి, గార్డెన్స్ సందర్శిస్తారు. అక్కడే భోజనం ముగించుకొని విశాఖకు పయనమవుతారు. తిరుగు ప్రయాణం రోడ్డు మార్గంలో సాగుతుంది. అనంతగిరి కాఫీ తోటలు, గాలికొండ వ్యూ పాయింట్, బొర్రా గుహల వీక్షణ ఉంటుంది. వైజాగ్ రైల్వే స్టేషన్‌, సిటీ లిమిట్స్‌కు చేరుకోవటంతో మీ ప్రయాణం పూర్తవుతుంది.

ఇవి గుర్తుంచుకోండి..

  • అరకు టూర్‌కు వెళ్లి రావటానికి రైలు టికెట్లు (ఎకానమీ, స్లీపర్‌ క్లాస్‌ ఎంపికను బట్టి) ప్యాకేజీలో అంతర్భాగంగా ఉంటాయి.
  • ప్యాకేజీలో పొందుపరిచిన సందర్శనా స్థలాల్ని వీక్షించటానికి ఏసీ బస్సు సదుపాయం ఉండదు.
  • ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం భోజనం, తేనీరు.. ఐఆర్‌సీటీసీయే అందిస్తుంది.
  • బొర్రా గుహల సందర్శన రుసుము ప్యాకేజీలో అంతర్భాగమే.
  • మిగతా పర్యాటక ప్రదేశాల్లో ఎక్కడైనా ప్రవేశ రుసుములు, ఫొటోలు, వీడియో రుసుములు ఉంటే ప్రయాణికులే చెల్లించాలి.
  • ప్రయాణ బీమా సదుపాయం ఉంటుంది.

ప్యాకేజీ ఛార్జీలు..

  • బడ్జెట్‌ కేటగిరీలో (2s class) పెద్దలకు రూ.2,130, 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే రూ.1,760 చెల్లించాలి.
  • స్టాండర్డ్‌ కేటగిరీలో (SL class) పెద్దలకు రూ.2,385, 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు అయితే రూ.1,915 చెల్లించాలి.
  • ఎగ్జిక్యూటివ్ ఛైర్‌కార్‌లో పెద్దలకు రూ.4,450, 5-11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.4,080 చెల్లించాలి.
  • ప్యాకేజీ నియమ, నిబంధనల పాలసీ ప్రకారం క్యాన్సిలేషన్‌ ఛార్జీలు ఉంటాయి. ప్రయాణానికి 15 రోజుల ముందు టికెట్‌ను రద్దు చేసుకుంటే చెల్లించిన మొత్తంలో రూ.250 మినహాయిస్తారు. ప్రయాణానికి నాలుగు రోజుల ముందు ప్రయాణం వద్దనుకుంటే ఎలాంటి చెల్లింపులూ ఉండవు.

ప్యాకేజీ బుకింగ్‌, ఇతర వివరాల కోసం IRCTC Tourism వెబ్‌సైట్‌ను సందర్శించండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని