‘సూపర్‌’ బ్రెడ్డు!

విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అనగానే బ్లూబెర్రీలు, గ్రీన్‌ టీ, రెడ్‌ వైన్‌ వంటివే గుర్తుకొస్తాయి. వీటిల్లో పాలీఫెనాల్స్‌ అనే వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి

Updated : 25 Nov 2020 15:22 IST

విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అనగానే బ్లూబెర్రీలు, గ్రీన్‌ టీ, రెడ్‌ వైన్‌ వంటివే గుర్తుకొస్తాయి. వీటిల్లో పాలీఫెనాల్స్‌ అనే వృక్ష రసాయనాలు దండిగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిపై అంత ఆసక్తి. సూపర్‌ ఫుడ్స్‌గానూ రోజురోజుకీ ప్రాచుర్యం పొందుతున్నాయి. కాకపోతే ఇవి అందరికీ అందుబాటులో ఉండేవి కావు. ఒకవేళ ఉన్నా రోజూ వాడుకోవటం సాధ్యం కాకపోవచ్చు. మరెలా? యూనివర్సిటీ ఆఫ్‌ రీడింగ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఇన్‌స్టిట్యూట్, రోథమ్‌స్టెడ్‌ రీసెర్చ్‌ శాస్త్రవేత్తలకు ఇలాంటి సందేహమే వచ్చింది. రోజూ తినే బ్రెడ్డునే సూపర్‌ ఫుడ్‌గా మార్చేస్తే? అనుకున్నదే తడవు రంగంలోకి దిగేశారు. పానీయాల తయారీలో తరచూ వాడే ఓ ఎంజైమ్‌ను పొట్టుతీయని గోధుమ పిండి బ్రెడ్డుకు జోడించారు. దీన్ని తిన్నవారి రక్తంలో ఫెరూలిక్‌ ఆమ్లం మోతాదులు ఐదు రెట్లు ఎక్కువ కావటం విశేషం. ఫలితంగా రక్త ప్రసరణ వ్యవస్థ కూడా మెరుగైంది. ఫెరూలిక్‌ ఆమ్లం శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌. ఇది ఇతర యాంటీఆక్సిడెంట్ల ప్రభావాలనూ ఇనుమడింపజేస్తుంది. అంటే హానికర విశృంఖల కణాల దుష్ప్రభావాలు గణనీయంగా తగ్గేపోయేలా చేస్తుందన్నమాట.

బ్రెడ్డు వంటి తృణధాన్య పదార్థాల స్వభావాలను కొద్దిగా మార్చి, మనకు మేలు చేసే సూక్ష్మపోషకాల స్థాయులు పెరిగేలా తీర్చిదిద్దొచ్చని తమ అధ్యయనం నిరూపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. పొట్టుతీయని తృణధాన్యాలతో చేసిన, పీచు ఎక్కువగా ఉండే బ్రెడ్లన్నింటిలోనూ బ్లూబెర్రీలు, ఇతర సూపర్‌ ఫుడ్స్‌లో మాదిరిగానే ఫెనోలిక్‌ రసాయనాలు ఉంటాయి. కాకపోతే ఇవి పీచుకు గట్టిగా అంటుకొని ఉంటాయి. ఇవి పేగుల్లోకి నెమ్మదిగా విడుదలవుతాయి. చాలాకాలంగా తింటుంటే తప్ప వీటి ప్రయోజనాలను పొందలేం.  బ్రెడ్డు తయారు చేయటానికి ముందే ఫెరూలిక్‌ ఆమ్లం విడుదలయ్యేలా చేసే ఎంజైమ్‌ను జోడిస్తే తిన్న వెంటనే శరీరానికి అందుబాటులోకి వచ్చేస్తుంది. ఫలితంగా రక్త ప్రసరణ సైతం త్వరగా మెరగవుతుంది. బ్రెడ్డు తయారీలో చిన్నపాటి మార్పుతో పరిశోధకులు దీన్ని సుసాధ్యం చేశారు. మామూలు బ్రెడ్డును బ్లూబెర్రీ మాదిరి సూపర్‌ ఫుడ్‌గా మార్చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని