Agnipath: సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌కు తాకిన ‘అగ్నిపథ్‌’ సెగ..ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపథ్‌’పై దేశవ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. ఆ సెగ హైదరాబాద్‌కూ తాకింది.

Updated : 17 Jun 2022 12:46 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ‘అగ్నిపథ్‌’పై దేశవ్యాప్తంగా కొనసాగుతున్న నిరసన సెగ హైదరాబాద్‌కూ తాకింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆందోళనకారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ యువకులు ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్‌ నుంచి కోల్‌కతా వైపు వెళ్లే ఈస్ట్‌కోస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పంటించారు. రైలు పట్టాలపై పార్సిల్‌ సామాన్లు వేసి వాటినీ తగలబెట్టారు. రైల్వేస్టేషన్‌లో ఉన్న దుకాణాలు, ఇతర స్టాళ్లు, డిస్‌ప్లే బోర్డులను ధ్వంసం చేశారు. అగ్నిపథ్‌ను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక కొనసాగించాలని ఆందోళనకారులు డిమాండ్‌ చేశారు. పోలీసులు రంగంలోకి దిగి రైలు బోగీలకు ఉన్న మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు.

 పోలీసులపైకి రాళ్లు.. గాల్లోకి కాల్పులు..

నిరసనను అడ్డుకునేందుకు యత్నించిన పోలీసులుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయువు ప్రయోగించారు. అయినా ఎక్కడా నిరసనకారులు వెనక్కి తగ్గకపోవడంతో గాల్లోకి కాల్పులు జరిపారు. నిరసనకారుల ఆందోళనతో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. స్టేషన్‌ లోపల, వెలుపల భారీగా పోలీసులు మోహరించారు.

 



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని