వైరస్‌ను జయించిన వారిలో దీర్ఘకాలం రక్షణ!

కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటాయనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే, కరోనా నుంచి కోలుకున్న తర్వాత యాంటీబాడీలు దాదాపు 8 నెలలు......

Published : 07 Jan 2021 23:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌-19 నుంచి కోలుకున్న వారిలో రోగనిరోధక శక్తి ఎంతకాలం ఉంటాయనే విషయంపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే, కరోనా నుంచి కోలుకున్న తర్వాత యాంటీబాడీలు దాదాపు 8 నెలలు, ఒక్కోసారి అంతకంటే ఎక్కువే ఉంటాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతేకాకుండా మరోసారి కొవిడ్‌ (రీ-ఇన్ఫెక్షన్‌) సోకినా వాటిపై పోరాడే సామర్థ్యం కలిగి ఉంటాయని చెబుతున్నారు. వీటిపై అమెరికాకు చెందిన లా జొల్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇమ్యూనాలజీకి చెందిన పరిశోధకులు అధ్యయనం చేపట్టారు.

సాధారణంగా వైరస్‌ సోకిన వారిలో భారీస్థాయిలో యాంటీబాడీలు భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతాయి. అయితే, ఇవి ఎంతకాలం ఉంటాయనే విషయాన్ని తెలుసుకునేందుకు అమెరికా పరిశోధకులు 188 మంది బాధితుల రక్తనమూనాలను విశ్లేషించారు. ముఖ్యంగా వీరిలో యాంటీబాడీలతో పాటు మెమొరీ బీ కణాలు, టీ కణాలు, ప్రతికూల ప్రభావం చూపే టీ కణాలనూ పరీక్షించారు. కొంతకాలానికి యాంటీబాడీలు తగ్గిపోవడం వాస్తవమే అయినప్పటికీ, అవి ఒక స్థాయిలో తటస్థంగా ఉండిపోతాయని పేర్కొన్నారు. మళ్లీ శరీరంలోకి వైరస్‌ ప్రవేశించినప్పుడు మెమొరీ బీ కణాలు వాటిని వెంటనే గుర్తించి దాడి చేస్తాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. పరిశోధనలో భాగంగా వైరస్‌ సోకి కోలుకున్న వారిలో ఆరునెలల తర్వాత మెమొరీ బీ కణాలు వృద్ధి చెందినట్లు గుర్తించామని తెలిపారు. అయితే, వైరస్‌ తీవ్రత, వ్యక్తులను బట్టి రోగనిరోధక శక్తిలో మార్పులు ఉంటాయని పరిశోధకులు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని