Universe: విశ్వంలో కొత్త రకం విస్ఫోటం

విశ్వంలో ఒక కొత్త రకం తారా విస్ఫోటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Updated : 10 Jul 2021 10:29 IST

పాలపుంతలో భార మూలకాల ఉత్పత్తికి ఇదే కారణం 
మిస్టరీని ఛేదించిన శాస్త్రవేత్తలు 

క్యాన్‌బెర్రా: విశ్వంలో ఒక కొత్త రకం తారా విస్ఫోటాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన పాలపుంత గెలాక్సీలో అనేక రకాల మూలకాల ఆవిర్భావానికి సంబంధించిన గుట్టుమట్లను విప్పింది. ఆస్ట్రేలియన్‌ నేషనల్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు.  న్యూట్రాన్‌ తారల విలీనం ద్వారా మాత్రమే భార మూలకాలు ఉత్పత్తవుతాయన్న భావన ఇప్పటివరకూ ఉండేది. అయితే విశ్వం ఆవిర్భావానికి కారణమైన ‘బిగ్‌ బ్యాంగ్‌’ సంభవించిన కొద్దికాలానికే ఈ భార మూలకాలు ఏర్పడిన సంగతి శాస్త్రవేత్తలకు తెలుసు. అంత తక్కువ వ్యవధిలో న్యూట్రాన్‌ నక్షత్రాల విలీనానికి అవకాశం లేదు. దీన్ని బట్టి పాలపుంతలో తొలినాటి భార మూలకాల ఉత్పత్తికి మరేదో కారణమై ఉంటుందన్నది స్పష్టమవుతోంది. అదేంటన్నది ఇప్పటివరకూ మిస్టరీగానే ఉండేది. ఈ నేపథ్యంలో పాలపుంత అంచుల్లో ‘ఎస్‌ఎంఎస్‌ఎస్‌ జే2003-1142’ అనే పురాతన నక్షత్రం వెలుగు చూసింది. ఇది బంగారం, యురేనియం సహా అనేక భార మూలకాలు ఏర్పడటానికి కారణమైన మరో అంశానికి సంబంధించి తొలి ఆధారాన్ని అందించింది. ఇందులోని భార మూలకాలు న్యూట్రాన్‌ తారల విలీనం వల్ల కాకుండా.. వేగంగా భ్రమణం చెందుతూ, బలమైన అయస్కాంత క్షేత్రం, సూర్యుడి కన్నా 25 రెట్లు అధిక ద్రవ్యరాశి కలిగిన నక్షత్రం కుప్పకూలి, విస్ఫోటం చెందడం వల్ల ఏర్పడి ఉంటాయనడానికి శాస్త్రవేత్తలు ఆధారాలు సేకరించారు. ఈ విస్ఫోటానికి ‘మ్యాగ్నెటోరొటేషనల్‌ హైపర్‌నోవా’ అని పేరు పెట్టారు. 

ఇవే ఆధారాలు.. : సూర్యుడితో పోలిస్తే.. ఎస్‌ఎంఎస్‌ఎస్‌ జే2003-1142లో ఇనుము దాదాపు 3వేల రెట్లు తక్కువగా ఉంది. దీన్నిబట్టి సదరు నక్షత్రం రసాయనపరంగా చాలా ప్రాథమిక దశలోనే ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులోని మూలకాలు.. రెండు న్యూట్రాన్‌ తారల విలీనం ద్వారా కాకుండా ఒకే మాతృ నక్షత్రం ద్వారా ఉత్పత్తి అయి ఉండటానికి ఆస్కారం ఎక్కువగా ఉందని తేల్చారు. సదరు మాతృ నక్షత్ర లక్షణాలనూ శాస్త్రవేత్తలు గుర్తించారు. అందులో నత్రజని, జింక్, యూరోపియం, యురేనియం వంటి భార మూలకాలు అసాధారణ స్థాయిలో ఎక్కువగా ఉన్నాయి. నత్రజని అధికంగా ఉండటాన్ని బట్టి దానికి చాలా ఎక్కువ భ్రమణం ఉండేదని తేల్చారు. జింక్‌ ఎక్కువగా ఉండటాన్ని బట్టి ఆ మాతృ తార విస్ఫోటం.. సాధారణ సూపర్‌నోవా కన్నా పదిరెట్లు శక్తిమంతంగా జరిగినట్లు గుర్తించారు. దీన్నిబట్టి అది హైపర్‌నోవాగా తేల్చారు. వీటన్నింటిని బట్టి చూస్తే ఎస్‌ఎంఎస్‌ఎస్‌ జే2003-1142 నక్షత్రం.. తొలినాటి మ్యాగ్నెటోరొటేషనల్‌ హైపర్‌నోవా ఫలితంగానే ఏర్పడి ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇలాంటి పరిణామం కారణంగానే విశ్వంలో తొలుత భార మూలకాలు ఉత్పత్తి అయి ఉంటాయని స్పష్టమవుతున్నట్లు తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని