బిహార్‌ కిక్కు.. ఏ పార్టీకి ఎంత..?  

అసలైన రాజకీయాలకు బిహార్‌ ఎన్నికలు సింబల్‌గా మారాయి. గత ఎన్నికల్లో మిత్రులే.. ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడ్డారు. కొందరిలో ఫలితాలు ఉత్సాహన్ని నింపగా..

Updated : 11 Nov 2020 11:58 IST

 కొందరికి మోదం.. కొందరికి ఖేదం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

అసలైన రాజకీయాలకు బిహార్‌ ఎన్నికలు సింబల్‌గా మారాయి. గత ఎన్నికల్లో మిత్రులే.. ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడ్డారు. కొందరిలో ఫలితాలు ఉత్సాహన్ని నింపగా.. మరికొందరిని ఉసూరుమనిపించాయి. భాజపా, లెఫ్ట్‌పార్టీలు, ఆర్జేడీ, ఎల్‌జేపీ ఖుషీగా ఉండగా.. కాంగ్రెస్‌, జేడీయూలు ఆందోళన చెందుతున్నాయి. 

భవిష్యత్తుకు పునాది..

దాదాపు రెండేళ్లుగా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలను చవి చూసిన భాజపాకు బిహార్‌ ఎన్నికలు మంచి కిక్కు ఇచ్చాయి. ఇక్కడ ఆ పార్టీ భారీగా లబ్ధిపొందింది. 2015 ఎన్నికలతో పోలిస్తే ఇక్కడ ఓట్లు, సీట్లు రెండింటినీ పెంచుకొంది. భాగస్వామ్య పక్షంలోని జేడీయూ బలహీనపడటం కూడా కమలానికి కలిసివచ్చింది. భవిష్యత్తులో ఆర్జేడీకి పోటీ ఇచ్చే ప్రధాన కూటమిగా అవతరించే అవకాశాన్ని పొందింది. అంతేకాదు విజయశాతం  కూడా జేడీయూతో పోలిస్తే భాజపాకు అధికంగా ఉంది. దీంతో జేడీయూతో అధికారాన్ని పంచుకొనే సమయంలో బలంగా బేరం ఆడటానికి అవకాశం లభించింది. మహారాష్ట్రలో శివసేన అనుభవాలను గుర్తుంచుకొని ముఖ్యమంత్రిగా నితీశ్‌ కుమార్‌నే కొనసాగించినా.. మంత్రివర్గంలో కీలక శాఖలు దక్కించుకునే అవకాశం ఉంది. కొన్నాళ్ల తర్వాత నితీశ్‌‌ను కేంద్ర మంత్రిగా పంపితే మాత్రం ముఖ్యమంత్రిగా భాజపా అభ్యర్థి తెరపైకి రావచ్చు. 

ఆర్జేడీకికి బలమైన నాయకత్వం..

లాలూ ప్రసాద్ యాదవ్‌ ఆర్జేడికి ప్రధాన నేత.. ఆయన కొన్నేళ్ల నుంచి జైల్లో ఉండటంతో ఈ ఎన్నికల్లో ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌ ఆర్జేడీ ప్రధాన నేతగా ఎదిగారు. ఎన్నికలకు ముందు చాలా రోజులు దిల్లీలో ఉన్న ఆయన.. రాష్ట్రానికి వచ్చింది మొదలు పార్టీ భారాన్ని భుజాన వేసుకొన్నారు. జేడీయూ అధినేత నితీశ్‌‌ కుమార్‌పై పదునైన విమర్శలు చేశారు. నిరుద్యోగం అంశాన్ని తెరపైకి తెచ్చి యువతను ఆకట్టుకునేందుకు బలంగా ప్రయత్నించారు. వాస్తవానికి దేశంలో అతితక్కువ ఎఫ్‌డీఐలు వస్తున్న రాష్ట్రాల్లో బిహార్‌ కూడా ఉంది. ఈ విషయాన్నే ఆయన ఆయుధంగా మలిచారు. మహాగట్‌ బంధన్‌కు ప్రచారం తేజస్వీయాదవే చూసుకున్నారు. కాంగ్రెస్‌తో పోలిస్తే ఆర్జేడీనే చురుగ్గా ఉంది. గతంతో పోలిస్తే ఐదు సీట్లు తగ్గినా.. పార్టీ పుంజుకొంది.  పార్లమెంట్‌ ఎన్నికల నాటి ఫలితాలకు తాజా ఫలితాలకు ఏమాత్రం పొంతనలేదు.

కాంగ్రెస్‌కు కష్టకాలమే..

ఈ ఎన్నికలు కాంగ్రెస్‌కు చేదు గుళికలను మింగించింది. గత ఎన్నికల్లో హస్తం పార్టీ 27 సీట్లను గెలుచుకొంటే ఈ సారి కేవలం 19 స్థానాలకు పరిమితమైంది. గతంలో ఈ పార్టీ 41 స్థానాల్లో పోటీ చేస్తే.. ఈ సారి 70 స్థానాల్లో పోటీలో నిలిచింది. కాంగ్రెస్‌కు ఎక్కువ సీట్లు కేటాయించారని.. ఇది కూటమికి చేటు చేసిందనే విమర్శలు కూడా ఉన్నాయి. వీటిల్లో కొన్ని సీట్లలో అయినా ఆర్జేడీ బరిలోకి దిగితే పోటీ మరింత రసవత్తరంగా మారేది. ప్రధానంగా ఆపార్టీకి రాష్ట్రంలో బలమైన నేత ఎవరూ లేకపోవడం పెద్ద మైనస్‌గా మారింది.

జేడీయూకు ప్రమాద ఘంటికలు..

ఏడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం  చేయడానికి నితీశ్‌ కుమార్‌ ప్రయత్నాలు మొదలుపెట్టినా.. ఆ పార్టీ నేతలను మాత్రం ఓటమి ఆందోళన వెంటాడుతోంది. దాదాపు 115 స్థానాల్లో పోటీ చేసి కేవలం 43 చోట్ల విజయం సాధించింది. అంటే 72 స్థానాల్లో ఓడిపోయిందన్నమాట..! పోటీచేసిన సగానికి పైగా స్థానాల్లో చుక్కెదురైంది. గత ఎన్నికలతో పోలిస్తే 28 సీట్లను కోల్పోయింది. మిత్రపక్షం భాజపాకు 21 సీట్లు పెరిగాయి. ఇదే తన చివరి ఎన్నికలు అని నితీశ్‌ చెప్పడం కూడా పార్టీకి చేటుచేసింది. దీంతో ఓటర్లు యవకులైన తేజస్వీ యాదవ్‌ వైపు మొగ్గు చూపడానికి కారణమైంది. దీనికి చిరాగ్‌ పాసవాన్‌ ఓట్లు చీల్చడం మరింత దెబ్బకొట్టింది. 

లెఫ్ట్‌ పార్టీలు.. ఏఐఎంఐఎం ఖుషీ..

ఈ సారి ఎన్నికల్లో లెఫ్ట్‌పార్టీలు, ఎంఐఎం అత్యధికంగా లబ్ధిపొందాయి. లెఫ్ట్‌పార్టీలు మూడు కలిపి 16 సీట్లు గెలుచుకొన్నాయి. గత ఎన్నికల్లో ఒక్క సీపీఐ ఎంల్‌ మాత్రమే 3 స్థానాలు గెలుచుకొంది. ఈ సారి 12 స్థానాలను దక్కించుకొంది. అంతేకాదు.. సీపీఐ 2, సీపీఐ(ఎం)2 స్థానాల్లో విజయం సాధించాయి. దీంతోపాటు ఎంఐఎం పార్టీ 5 స్థానాల్లో విజయం సాధించింది. గత ఎన్నికల్లో ఒక్కచోట కూడా విజయం సాధించలేదు. 
చిరాగ్‌ పాసవాన్‌..

చిరాగ్‌ పాసవాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ ఒక్కసీటులో విజయం సాధించింది. కానీ, ఈ పార్టీ నిర్ణాయక పాత్ర పోషించింది. జేడీయూ 1000లోపు ఓట్ల తేడాతో ఓడిపోయన చోట్ల ఎల్‌జేపీ కచ్చితంగా ప్రభావం చూపించిందని భావిస్తున్నారు. అదే సమయంలో భాజపాతో సంబంధాలను మెరుగుపర్చుకొన్నారు. ఒక దశలో తాను మోదీకి హనుమంతుడి వంటి వాడినిన ప్రకటించారు.  మోదీ కూడా ఎన్నికల ప్రచారంలో చిరాగ్ పాసవాన్‌ను ఒక్కమాట కూడా అనలేదు. భవిష్యత్తులో భాజపాకు అవసరమైన యువనేత రూపంలో చిరాగ్‌ అవతరించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని