టిక్‌టాక్‌ బ్యాన్‌: అమెరికాపై చైనా ఆగ్రహం!

దేశంలో టిక్‌టాక్‌ను నిషేధించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై చైనా విరుచుకుపడింది. ట్రంప్‌ తాజా ప్రకటనను చైనా పూర్తిగా వ్యతిరేకించింది.

Published : 07 Aug 2020 19:38 IST

ఆధిపత్య ధోరణిలో భాగమేనని విమర్శ

బీజింగ్‌: దేశంలో టిక్‌టాక్‌ను నిషేధించాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయంపై చైనా విరుచుకుపడింది. ట్రంప్‌ తాజా ప్రకటనను చైనా పూర్తిగా వ్యతిరేకించింది. తమ దేశానికి చెందిన వాణిజ్య కంపెనీలకు తాము మద్దతుగా ఉంటామని చైనా స్పష్టం చేసింది. నిర్ణయం అనంతర పర్యవసానాలకు అమెరికా సిద్ధంగా ఉండాలని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అమెరికాను హెచ్చరించారు.

‘జాతీయ భద్రత అనే సాకు చూపుతూ తమకున్న అధికారాలతో అమెరికాయేతర కంపెనీలను అమెరికా అణచివేస్తోంది. ఇది కేవలం ఆధిపత్య ధోరణి మాత్రమే. అమెరికా వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నాం’ అని చైనా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ అభిప్రాయపడ్డారు. తాజా చర్యలతో వాణిజ్య కంపెనీల, వినియోగదారుల ప్రయోజనాలను అమెరికా విస్మరిస్తోందని మండిపడ్డారు. ఇది కేవలం రాజకీయ సమీకరణాలను తారుమారు చేయడం, అణచివేతకు గురిచేయడంలో భాగమేనని పేర్కొన్నారు. తాజా చర్యలతో అమెరికా తనకున్న నైతిక స్థానాన్ని కోల్పోవడంతోపాటు దేశకీర్తి, నమ్మకాన్ని పూర్తిగా పోగొట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు.

న్యాయపరంగా ఎదుర్కొంటాం..
అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు టిక్‌టాక్‌ సిద్ధమైనట్లు సమాచారం. తాము అమెరికా చట్టాలకు అతిక్రమించలేదనే విషయాన్ని స్పష్టం చేసేందుకు తమకున్న అన్ని దారుల్లో కృషిచేస్తామని టిక్‌టాక్‌ ప్రకటించింది. ప్రభుత్వంతో కాకుంటే అమెరికా న్యాయస్థానాల్లో దీనిపై పోరాడుతామని ఓ ప్రకటనలో తెలియజేసింది. 
అమెరికాలో టిక్‌టాక్‌తో పాటు వియ్‌చాట్‌ యాప్‌లపై వచ్చే 45రోజుల్లో నిషేధించాలనే ఉత్తర్వులపై ట్రంప్‌ సంతకం చేసిన విషయం తెలిసిందే.

ఇవీ చదవండి..
టిక్‌టాక్‌ యూఎస్‌లోనూ నిషేధం
మైక్రోసాఫ్ట్‌ చేతికి టిక్‌టాక్‌ ఇండియా?

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని