చంద్రుడి నుంచి భూమికి బయలుదేరిన క్యాప్సుల్‌!

చంద్రుడుపై నమూనాల సేకరణే లక్ష్యంగా చైనా చేపట్టిన ప్రయోగం తుది దశకు చేరుకుంటోంది.

Published : 14 Dec 2020 01:56 IST

చంద్రుడిపై 2కిలోల నమూనాల సేకరణ

ఇంటర్నెట్‌ డెస్క్‌: చంద్రుడుపై నమూనాల సేకరణే లక్ష్యంగా చైనా చేపట్టిన ప్రయోగం తుది దశకు చేరుకుంటోంది. ఇప్పటికే చంద్రుడి ఉపరితలంపై అడుగుపెట్టిన చైనా ల్యాండర్‌, అక్కడ రెండు మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేపట్టి రాళ్లు, మట్టి నమూనాలను సేకరించింది. తాజాగా అక్కడి నుంచి వాటిని తీసుకున్న క్యాప్సుల్‌, భూమికి బయలుదేరిందని చైనా నేషనల్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. చాంగే-5లోని నాలుగు ఇంజన్లను 22నిమిషాల పాటు యాక్టివేట్‌ చేసిన అనంతరం చంద్రుడి కక్ష్య నుంచి భూమికి బయలుదేరినట్లు తెలిపింది.

నాలుగు దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత చైనా ప్రయోగించిన వ్యోమనౌక చంద్రుడిపై విజయవంతంగా అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం చంద్రుడి ఉపరితలంపై దాదాపు 2కిలోల (4.4పౌండ్ల) మట్టి, రాళ్లను సేకరించింది. ప్రస్తుతం అక్కడి నుంచి వాటిని తీసుకొని బయలుదేరిన క్యాప్సుల్,‌ మూడు రోజుల తర్వాత భూమికి చేరుకునే ఉవకాశం ఉంది. ఇది ఉత్తర చైనా ప్రాంతంలో దిగనున్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

తాజా నమూనాల ద్వారా చంద్రుడిపై గత అన్వేషణల్లో అర్థం కాని విషయాలను గురించి తెలుసుకునేందుకు, చంద్రుడిపై మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఈ ప్రయోగం దోహదపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.

చంద్రుడి నమూనాల సేకరణ ఇలా..
* చంద్రుడి ఉపరితలం నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చాంగే-5 చేరింది. ఆ తర్వాత ల్యాండర్‌-అసెండర్‌లు సంయుక్తంగా విడిపోయి.. జాబిల్లి ఉపరితలంపైకి దిగాయి. ఆర్బిటర్‌-రిటర్నర్‌లు కక్ష్యలోనే ఉండిపోయాయి. అవి డాకింగ్‌ కేంద్ర బాధ్యతలను నిర్వహించాయి.
* ల్యాండర్‌-అసెండర్‌లు చంద్రుడి వాయవ్య ప్రాంతంలోని ‘ఓషెనస్‌ ప్రొసెల్లారమ్‌’ అనే ప్రాంతంలో దిగాయి. ల్యాండర్‌లోని రోబో హస్తం.. చంద్రుడి ఉపరితలంపై రెండు మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేపట్టి రెండు కిలోల శిలలు, మట్టి నమూనాలను సేకరించింది. వాటిని అసెండర్‌లోకి చేరవేసింది.  
* అనంతరం అసెండర్‌.. నమూనాలతో సహా నింగిలోకి వెళ్లి కక్ష్యలో ఉన్న ఆర్బిటర్‌-రిటర్నర్‌తో సంధానమైంది.
* ప్రస్తుతం చంద్రుడి రాళ్లు, మట్టిని తీసుకొని రిటర్నర్‌ భూమికి బయల్దేరింది. మరో మూడు రోజుల్లో భూమికి చేరుకోనుంది.

ఇవీ చదవండి..
చందమామపైకి సిద్ధమైన చైనా రాకెట్‌!
చందమామపై చైనా జెండా

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని