2035 నాటికి ప్రజారోగ్యంపై పూర్తి నిఘా

భవిష్యత్తులో మహమ్మారులు మానవాళిని మరింత వేగంగా చుట్టుముట్టే ప్రమాదం ఉన్నందున తొలిదశలోనే పసిగట్టేలా దేశంలో పటిష్ఠమైన ప్రజారోగ్య నిఘా వ్యవస్థను ఏర్పాటుచేయాలని నీతి ఆయోగ్‌ పేర్కొంది.........

Published : 15 Dec 2020 22:54 IST

దార్శనిక పత్రం విడుదల చేసిన నీతి ఆయోగ్‌

దిల్లీ: భవిష్యత్తులో మహమ్మారులు మానవాళిని మరింత వేగంగా చుట్టుముట్టే ప్రమాదం ఉన్నందున తొలిదశలోనే పసిగట్టేలా దేశంలో పటిష్ఠమైన ప్రజారోగ్య నిఘా వ్యవస్థను ఏర్పాటుచేయాలని నీతి ఆయోగ్‌ పేర్కొంది. అందుకు తీసుకోవాల్సిన చర్యలపై కెనడాలోని మానిటోబా యూనివర్సిటీతో కలిసి రూపొందించిన 2035 దార్శనిక పత్రాన్ని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌కుమార్‌ సోమవారం విడుదల చేశారు. ‘‘ప్రస్తుతం దేశంలో ఉన్న మూడంచెల ఆరోగ్య వ్యవస్థతో పాటు, సామాజిక నిఘాను బలోపేతం చేయాలి. వైద్యఆరోగ్య వ్యవస్థను పూర్తిగా ఆయుష్మాన్‌ భారత్‌తో అనుసంధానించాలి. దీంతోపాటు రెఫరల్‌ నెట్‌వర్క్‌ను విస్తరించాలి. ప్రయోగశాలల సామర్థ్యాన్ని పెంచాలి. రోగుల వ్యక్తిగత ఎలక్ట్రానిక్‌ హెల్త్‌రికార్డులపై నిఘా ఉంచి దేశంలో జరుగుతున్న ఆరోగ్య పరిణామాలను గుర్తించాలి. జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో క్రమం తప్పకుండా ఆరోగ్య సర్వేలు నిర్వహించాలి.

రోగాల రూపాంతరాలపై ప్రత్యేక అధ్యయనాలు, పరిశోధనలు చేపట్టాలి. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ప్రత్యేక స్వతంత్ర వ్యవస్థలు ఏర్పాటుచేయాలి. సరికొత్త డేటా పంపిణీ విధానం ఉండాలి. ఇప్పటిలా సంప్రదాయబద్ధమైన డేటా ఎంట్రీపై ఆధారపడకుండా నూతన ఎనలిటిక్స్, హెల్త్‌ ఇన్ఫర్మాటిక్స్, డేటాసైన్స్‌తో పాటు మరిన్ని వినూత్న విధానాలు అవలంబించాలి. దీనివల్ల ప్రజారోగ్య నిఘాలో భారత్‌ ప్రపంచస్థాయి నాయకత్వం వహించే అవకాశం ఉంది’’ అని నీతిఆయోగ్‌ పేర్కొంది. 

ఏపీలో అమలవుతున్న సీడ్‌ గురించి ప్రస్తావన..

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సిస్టమ్‌ ఫర్‌ ఎర్లీ వార్నింగ్‌ బేస్డ్‌ ఆన్‌ ఎమర్జెన్సీ డేటా(సీడ్‌) గురించి ప్రస్తావించింది. ఈ ప్రాజెక్టును జీవీకే ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఈఎంఆర్‌ఐ), జర్మనీకి చెందిన జియోమెడ్‌ రీసెర్చ్‌ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తూ ప్రాథమిక స్థాయిలో కనిపించే రోగ లక్షణాలపై నిఘా ఉంచినట్లు పేర్కొంది. డేటాబేస్, అల్గారిథమ్, జీఐఎస్‌ టూల్స్‌ ద్వారా ఈ ప్రాజెక్టును నిర్వహిస్తున్నారని, ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్‌ సిస్టం తనకు అవసరమైన సమాచారాన్ని హైదరాబాద్‌లోని స్టేట్‌ డిస్పాచ్‌ సెంటర్‌ ద్వారా ఆటోమేటిక్‌గా క్యాప్చర్‌ చేస్తున్నట్లు పేర్కొంది. ఇలా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించుకొని రాబోయే రోగాల గురించి ముందస్తుగా హెచ్చరిస్తుందని నీతి ఆయోగ్‌ వివరించింది. ఈ ఎమర్జెన్సీ సిస్టం 15 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉత్పత్తి అయ్యే డేటాను క్యాప్చర్‌ చేస్తున్నట్లు చెప్పింది.

ఇవీ చదవండి..

కొవిడ్‌ ముప్పును ముందే హెచ్చరించే స్మార్ట్‌ రింగు

వాతావరణ ధూళితో ఖండాంతరాలకు బ్యాక్టీరియా వ్యాప్తి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని