అలా రండి.. చర్చలకు మేం సిద్ధమే!

వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తేనే చర్చలకు సిద్ధమని తేల్చి చెప్పారు. కేంద్రం రైతు సంఘాలను.........

Updated : 23 Dec 2020 18:51 IST

కేంద్రం తాజా ఆహ్వానాన్ని తిరస్కరించిన అన్నదాతలు

దిల్లీ: వ్యవసాయ చట్టాలపై కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ఆహ్వానాన్ని కూడా రైతు సంఘాల నేతలు తిరస్కరించారు. నిర్మాణాత్మక ప్రతిపాదనలతో వస్తేనే చర్చలకు సిద్ధమని తేల్చి చెప్పారు. కేంద్రం రైతు సంఘాలను అప్రతిష్టపాలు చేయాలని చూస్తోందని విమర్శించారు. దీనిపై కేంద్రానికి రైతుల ఐక్యవేదిక పేరుతో లేఖరాసినట్టు చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళన చేస్తున్న రైతులను ఆరో దఫా చర్చలకు ఆహ్వానిస్తూ కేంద్రం రాసిన లేఖపై సమావేశమై రైతు నేతలు చర్చించారు. అనంతరం సాయంత్రం సింఘూ సరిహద్దు వద్ద రైతు సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు. చర్చలకు తాము సిద్ధంగానే ఉన్నామని, గతంలో సవరణలు చేస్తామంటూ ఇచ్చిన ప్రతిపాదనలను అప్పుడే తిరస్కరించామన్నారు. ఉద్యమంతో సంబంధంలేని సంఘాలతో కేంద్రం మాట్లాడుతోందని.. తద్వారా తమ ఉద్యమాన్ని బలహీనం చేసేందుకు కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రైతులు చర్చలకు ఇష్టంగా లేరనే ప్రచారం అవాస్తవమని రైతు సంఘాలు స్పష్టంచేశాయి.  

కేంద్రం రాతపూర్వక హామీలతో రావాలని కోరుతున్నట్టు రైతులు చెప్పారు. మూడు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాల్సిందేనని మరోసారి డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధర విషయంలో స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులకు అనుగుణంగా చట్టం తేవాలని కోరారు. ఇలాంటి లిఖితపూర్వక ప్రతిపాదనలతో చర్చలకు పిలిస్తేనే వస్తామని తేల్చి చెప్పారు. చర్చలు ఫలప్రదంగా సాగేందుకు అనువైన వాతావరణాన్ని కేంద్రం సృష్టించాలని అభ్యర్థించారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా పంపిన ప్రతిపాదనల్లో కనీస మద్దతు ధరపై ఎలాంటి స్పష్టత లేదన్నారు. ఈ నేపథ్యంలో చర్చలకు కేంద్రం రైతులను మరోసారి ఆహ్వానిస్తుందా? లేదా? సాగు చట్టాలు పూర్తిగా వెనక్కి తీసుకొని.. కొత్త చట్టం తెచ్చే ప్రతిపాదనలతో రావాలంటున్న రైతుల డిమాండ్‌పై కేంద్రం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవీ చదవండి..

25న రైతులతో మాట్లాడనున్న మోదీ

‘నా పేరు సరబ్‌జీత్‌.. నేను భారత రైతును’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని